ప్రస్తుత కాలంలో దేనిలోనూ నాణ్యత ఉండటం లేదు. ఇళ్ల నుంచి రోడ్ల నిర్మాణాల వరకూ నాణ్యత ప్రశ్నార్ధకంగానే మారుతోంది. నిర్మాణంలో ఉండగానే వంతెనలు, అలాగే ఇళ్ల పై వేసిన స్లాబులు కూలిపోతున్నాయి. ఇక రోడ్లయితే చెప్పనక్కర్లేదు. ఇవాళ వేసిన రోడ్డు రెండు రోజుల్లోనే గుంతలమయంగా మారిపోతోంది. అలాంటిది ఓ రోడ్డు 75 ఏళ్లుగా చెక్కుచెదరలేదంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ రోడ్డు తమిళనాడులో ఉంది. ఈ రోడ్డు నాణ్యత వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో రూ.కోట్లు వెచ్చించి రోడ్లు వేసినా ఏడాది తిరగకముందే దెబ్బతింటున్నాయి. కానీ, తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడిలో ఇడైయర్ వీధి బైపాస్ రోడ్డు జంక్షన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు.
అది కూడా 1949లో ‘చెట్టినాడు’ సంప్రదాయ పద్ధతిలో ఆవాలు, కరుప్పట్టి (తాటి బెల్లం లాంటిది), సున్నం మొదలైన సహజ మిశ్రమాలతో ఈ రోడ్డును వేశారు. ఇలాంటి మార్గాలను ‘స్లర్రీ రోడ్లు’గా పిలుస్తారు. అప్పుడు వేసిన ఈ దారి 75 ఏళ్లుగా చెక్కుచెదరకుండా నేటికీ వినియోగంలో ఉంది. డ్రైనేజీ పనుల కోసం ఈ రోడ్డును తవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ రెండుసార్లు ప్రయత్నించింది. అయితే సామాజిక కార్యకర్తలు అందుకు ఒప్పుకోకపోవడంతో కార్పొరేషన్ వెనక్కు తగ్గింది. అనంతరం రోడ్డు పక్కన మూడు చోట్ల గోతులు తవ్వి డ్రైనేజీ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ రహదారిని తారురోడ్డుగా మార్చడానికి కార్పొరేషన్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని సంప్రదాయ పర్యాటకరోడ్డుగా ప్రకటించాలని కారైక్కుడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పురాతనమైన ఈ మార్గంలో రోజుకు 50కి పైగా లారీలు భారీ లోడుతో వెళ్తుంటాయని, అయినా ఎక్కడా గుంతలు పడలేదన్నారు. ఇంకో 50 ఏళ్లయినా ఇది అలానే ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. అందుకే ఈ రోడ్డును అలాగే ఉండనివ్వాలన్నారు.