పంట పండించడం ఒక ఎత్తయితే.. ఆ పంటను కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అడవి పందులు, జింకలు, పక్షులు.. వివిధ రకాల పంటలను తినడంతో పాటు నాశనం చేస్తున్నాయి. దీంతో రాజధాని రైతులు సరికొత్త ఆలోచనకు రూపకల్పన చేశారు.
Mic For Protect Crops
అమరావతి రాజధాని ప్రకటన తర్వత ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రైతులు రాజధానికి ఇచ్చేశారు. అయితే రాజధాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇంకా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఆహార పంటలు సాగు చేస్తున్నప్పుడు పక్షులు, జంతువులు బెడద ఎక్కువుగా ఉంటున్నట్లు అక్కడి రైతాంగం చెబుతున్నారు. ప్రధానంగా చాలా వరకూ భూములు రాజధానికి ఇచ్చేయడంతో సమీపంలో ఉండే వ్యవసాయ భూములు కావడంతో జంతుజాలాల దాడికి ఎక్కువుగా ఉంటుందని అన్నదాతలు అంటున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, పుచ్చకాయ, కాయగూరలు వంటి వాటిని సాగు చేస్తున్న సమయంలో పక్షులతో పాటు పందులు, వంటివి పంటలపై పడి పాడు చేస్తున్నాయి. ఈక్రమంలోనే పంటలను కాపాడుకోవాలంటే కాపాల పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎకరం పొలంలో పంటను కాపాడుకోవాలంటే కూలీ వ్యక్తికి ఏడు వందల రూపాయల కూలీ ఇవ్వాల్సి వస్తుందని వ్యవసాయదారులు వాపోతున్నారు.
ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించడంతో పాటు పశుపక్షాదు బెడద తగ్గించుకునేందుకు సరికొత్త ఆలోచన చేశారు రాజధాని రైతులు…మొక్కజొన్న పంటలో ఏకంగా చిన్న, చిన్న మైకులు పెడుతున్నారు. ఎకరానికి నాలుగు మూలల నాలుగు మైకులు పెడుతున్నారు. ఈ మైకులో ముందే వాయిస్ రికార్డింగ్ చేసి దాన్నే పదే పదే వినిపించేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పొలంలో నిత్యం మనుషులు సంచరిస్తున్న భావన కనిపించేటట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పక్షులతో పాటు పందులు వంటివి కూడా పంట పొలంలోకి రాకుండా ఉంటాయంటున్నారు. ఇందుకు ఖర్చు కూడా తక్కువుగానే ఉంటుంది. మైక్‌ను ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేసి అది పనిచేయడానికి పవర్ బ్యాంక్ ను జత చేస్తున్నారు. పవర్ బ్యాంక్ కోసం మరో ఏడు వందల రూపాయలు ఖర్చవుతున్నట్లు రైతు ఎలీసా చెప్పారు. ఎకరానికి రెండు మూడు మైకులు పెడుతున్నట్లు తెలిపారు. ఖర్చు తక్కువుగా ఉండటంతో పాటు పంటలను కాపాడుకునేందుకు ఈ మార్గం సౌలభ్యంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. రైతుల ఆలోచనను పలువరు అభినందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..