ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికాలంలో ఉసిరిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణుల చెబుతుంటారు. అయితే ఉసిరిని నేరుగా తినేకంటే జ్యూస్ రూపంలో చేసుకొని తాగితే మరిన్ని లాభాలు ఉంటాయని అంటున్నారు. ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటి.? ఉసిరి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరి రసాన్ని తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చలికాలంలో తరచూ వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఉసిరి రసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలం వచ్చే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో ఉసిరి ఉపయోగపడుతుంది. కంటిలో గ్లాకోమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉసిరి రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఉసిరిలను తీసుకోవాలి. అనంతరం వాటిని పరిశుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉసిరిని చిన్నచిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో వేయాలి. సరిపడ నీటిని కలుపుకుంటూ.. జ్యూస్‌గా చేసుకోవాలి. అనంతరం జ్యూస్‌ను వడకట్టి గ్లాసులోకి తీసుకోవాలి. కొంచెం తేనె కలుపుకోవాలి. ఉసిరి జ్యూస్‌ను ఉదయం ఖాళీ కడపుతో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనం తర్వాత ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉసిరి రసాన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వెంటాడుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వైద్యుల సూచనలు పాటించాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..