పాపం ఆమె మానసిక రోగి.. ఆరోగ్యం క్షీణించింది.. ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి.. దీంతో కుటుంబసభ్యులు ఆమె వెన్నంటే ఉంటూ చికిత్స అందిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో సెల్ ఫోన్ మింగింది ఆ మహిళ.. దీంతో ప్రాణాలు కోల్పోయింది.. మానసిక రుగ్మలతో బాధపడుతూ.. సెల్‌ఫోన్ మింగి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో చోటుచేసుకుంది.. మహిళ సెల్ ఫోన్ మింగిన తర్వాత జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు..
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) గత 15 ఏళ్ల నుంచి మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో స్మృతిని కుటుంబసభ్యులు శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు..
ఈ క్రమంలోనే ఆమె కీ ప్యాడ్ మొబైల్‌ను మింగేసింది. అయితే, బంధువులు మొబైల్ కనిపించకపోవడంతో స్మృతి బెడ్ వద్ద వెతికారు.. దొరకలేదు.. కొద్దిసేపటి తర్వాత రమ్యను ప్రశ్నించగా.. తాను మొబైల్ మింగినట్లు చెప్పింది.. దీంతో వెంటనే కుటుంబసభ్యులు డాక్టర్లకు సమచారం ఇచ్చారు.. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి మొబైల్‌ను తొలగించారు.
అప్పటికే.. అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్ పూర్తిగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు.. అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. స్మృతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
రాజమహేంద్రవరం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు విడిచిందని మృతురాలి తండ్రి ఆరోపించారు. తమ కుమార్తె 2010 నుంచి మానసిక సమస్యతో బాధపడుతుందని.. రాజమంత్రి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..