Andhra Pradesh: కొండల నడుమ కూర్మ గ్రామం.. ప్రకృతి ఒడిలో శ్రమైక జీవన సౌందర్యం

2 hours ago 1

ప్రకృతే సర్వస్వం. ఆ ప్రకృతి ఒడిలోనే జీవనం… పచ్చని వాతావరణం నడుమ కొలువైనదే కూర్మ గ్రామం… ఆధ్యాత్మికతతో జీవితం పరిపూర్ణం అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పల్లె జీవనవిధానం.. మరుగున పడిందనుకున్న పురాతన సాంస్కృతిక జీవనాన్ని కళ్లకు కడుతున్నారు.  కట్టుబొట్టుతో పాటు మన పద్దతు, ఆహారపు అలవాట్లకు పునరజ్జీవనం పోస్తున్నారు.  నేటి మానవాళికి అనంతమైన సందేశాన్ని ఇస్తున్నారు.

కుగ్రామం అంటే నిజంగా కుగ్రామమే. పట్టుమని పది కుటుంబాలు కూడా ఉండవు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగ క్షేత్రానికి దగ్గర్లో ఉన్న కూర్మ గ్రామంలో, ఇక్కడి వారి జీవన శైలి పూర్తిగా ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతుల్లో కనిపిస్తుంది. నిత్యం ఆధ్యాత్మిక భావన ఉట్టి పడుతూ ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 56 మంది నివాసముంటున్నారు. ప్రాచీన గ్రామీణ ప్రజల పద్దతు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం.

ఆధునిక కాలానికి ఏ మాత్రం సంబంధం లేని పల్లె జీవనం ఇక్కడ కనిపిస్తుంది. పాతకాలంలో ఉన్నటువంటి ఇల్లే ఇక్కడ  దర్శనమిస్తాయి. మట్టి, ఇసుక, సున్నంతో కట్టిన ఇల్లు- మళ్లీ మనల్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి.  ఇళ్ల నిర్మాణానికి వీరే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి, గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు నిర్మించారు. నిర్మాణంలో సిమెంటు, ఇనుమును ఏ మాత్రం వాడరు.

ఒకప్పుడు పాటించిన పాత పద్దతులనే పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. యంత్రాలు, రసాయనాలు అవసరం లేకుండానే సాగు చేసుకుంటూ తమకు కావాల్సిన పంటలను పండించుకుంటున్నారు. అంతేకాదు రోజూ సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. ఒకరు వేదం నేర్పే గురువుగా, ఒకరు వ్యవసాయం చేసే రైతుగా, మరొకరు బట్టలు నేనే నేతన్నగా, ఇంకొకరు వడ్రింగిలా,, ఇలా ఎవరి అభిరుచి వారిది. సామర్ధ్యానికి తగ్గ పనిచేస్తారు.

భారతీయ సనాతనం అంటే కట్టు, బొట్టు, వేషధారణ మాత్రమే కాదు, పండించే పంటలలోనూ సనాతన పద్దతులుండాలంటారు. అందుకే ఇక్కడ వ్యవసాయం, పశుపోషణ ఒక సాధారణ వృత్తి. ఒకప్పుడు పండించిన బ్లాక్‌రైస్‌, రెడ్‌రైస్‌ వంటి దేశీయ వరి వంగడాలనే ఇక్కడ పండిస్తున్నారు. ఏడాదికి సరపడా ధాన్యం పండించుకుంటారు.

డబ్బులతో పనిలేకుండా ఒకరికి ఒకరు సహాయపడుతూ సాఫీగా జీవనాన్ని సాగిస్తున్నారు. నిత్యావసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చంటారు. సరళ జీవనం, ఉన్నత చింతనం వీరి విధానం. విత్తనం నాటింది మొదలు కోతల వరకు సొంతంగా పండిస్తారు. బట్టలను ఉతికేందుకు కూడా డిటర్జెంట్‌ వాడరు. సహజసిద్దమైన కుంకుడుకాయ రసంతో ఉతుక్కుంటారు.

ఉదయం భజన, ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళతారు. ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు, సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం, చేతివృత్తులు, తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు. వయస్సు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు.

ఉన్నత చదువులు చదువుకున్నా, ప్రాచీన పద్దతులను మాత్రం వీడాలనుకోలేదు. అందుకే 2018లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఇక్కడ తమ కుటీరాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్థులు మమేకం అవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రామాయణం, భాగవతం, భగవద్గీత  మొదలైన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, శాస్త్రాలను నేర్పుతుంటారు. చదువు అనేది ఇక్కడ కేవలం మనం ఆ భగవంతుని గురించి తెలుసుకోవడాని, ఆయన సూచించిన మార్గంలో నడవడానికే ఉపయోగపడాలని వీరు నమ్ముతుంటారు. ఇక్కడి విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు.  ఆధ్యాత్మిక చింతనతో ప్రకృతి మధ్య ప్రశాంతంగా నివసిస్తున్నారు.

పూర్వం తాత ముత్తాతలతో కలిసి జీవించిన సందర్భాన్ని కుర్మ గ్రామం కళ్లకు కడుతుంది. ప్రకృతితో మిళితమైన మనిషి జీవితం ఎలా ఉంటుందో నేటి తరానికి చాటి చెబుతుంది. ఇక్కడ ఉంటున్న వారంతా గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వారే. లక్షల్లో జీవితాలు తీసుకున్న వారే. కానీ యాంత్రిక జీవితంతో విసుగుచెందారు. ఆధునిక జీవితంలో ఆనందం కంటే మట్టి ఇంటిలో, పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందంటారు వీరు.

కరెంటు ఉండదు, ఫ్యాన్లు టీవీలు, ఫోన్ల మాటే ఎరుగరు. విద్యుత్‌ ఉంటే సౌకర్యాలు పెరుగుతాయి, అందుకు డబ్బు అవసరం అవుతుంది. దాని వల్ల మళ్లీ యాంత్రికంగా మారే ప్రమా దముందంటారు. ప్రకృతిలో మమేకమై పరమానందాన్ని పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామానికి తరలివచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భగవంతుని సేవ కోసం ఇక్కడికి వస్తున్నవారున్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు కూడా ఇలాంటి భక్తిమయమైన జీవన విధానంలోనే ఉండేవారు. మారుతున్న కాలానుగుణంగా నేటి అనేక మార్పులు వచ్చినా ఇక్కడి వారు మాత్రం ఆ వైపు వెళ్లాలనుకోలేదు. అందుకే ఇక్కడకు వచ్చి సంప్రదాయమైన జీవన విధానాన్ని గడుపుతూ వారి ప్రతిభ, అభిరుచికి తగ్గట్టుగా పని, సేవ భావంతో జీవిస్తున్నారు.

కూర్మగ్రామంలో వసతి, భోజనం అంతా ఉచితం. ఇక్కడ ఉండాలనుకునే వారు కచ్చితంగా ఇక్కడి నియమాలను పాటించాల్సి ఉంటుంది. స్త్రీలు ఒంటరిగా ఉండేందుకు అనుమతించరు. తమ తండ్రి, భర్త, లేదంటే సహోదరులతో వస్తే ఉండేందుకు అనుమతిస్తారు. ఆశ్రమంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉదయం 3.30లకే నిద్ర లేచి దైవ ఆరాధాన సేవాకార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు.

అన్నీ ఉన్న ఈ ఆధునిక కాలంలో ఏవీ వద్దనుకున్నారు. ఏ చీకూ చింత ఉండొద్దనుకున్నారు. తమ జీవన విధానమే నవ సమాజానికి వెలుగు నింపేలా ఉండాలనుకున్నారు. అందుకు ఆధ్యాత్మికతను ఎంచుకుని సనాతన భారతీయ గ్రామీణ జీవనానికి తిరిగి పునరుజ్జీవనం పోసే ప్రయత్నం చేస్తోంది కృష్ణ చైతన్య సమాజం.

గ్రామీణ భారతం అంటేనే, వ్యవసాయం పశుపోషణ మొట్టమొదటి వృత్తిగా మనకు తెలుసు. రైతు అంటే స్వయం సమృద్ధి, సంపద కలిగిన రాజు లాంటి వాడు. స్వాతంత్రానికి పూర్వం, రైతు తనకు కావలసిన ఆహార పదార్థాలను, వస్త్రాలను స్వయంగా చేసుకుని, సాగు చేయలేని వాటిని “వస్తు మార్పిడి” పద్దతిలోను సమకూర్చుకునే వాడు. అదంతా గతం. ఇప్పుడు గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రపంచీకరణతో పల్లె, పట్టణాలన్న తేడా లేకుండా గ్రామీణ భారతం ఉనికి కోల్పోతుంది. మారుమూల గ్రామాల్లో సైతం ఆర్భాటాలూ పెచ్చిమీరిపోయాయి. ఈ క్రమంలో మాయమైపోయిన మన సంస్కృతి, సంప్రదాయాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ జీవం పోసేలా చూస్తున్నారు.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కాలం గడుపుతున్నారు కూర్మ గ్రామస్తులు. ఆధ్యాత్మిక హంగులు ఏ మాత్రం కనిపించవు. ఆధ్యాత్మిక చింతన ఒక్కటే మార్గం. ప్రకృతి ఒడిలో సుఖంగా బతకడమే ఈ జీవితానికి పరమార్ధం అంటారు. జీవన విధానం మొత్తం పాతకాలంలో ఉన్నట్టుగానే ఉంటాయి. సహజసిద్దంగా లభించే సూర్యరశ్మి, చంద్రుడి వెలుగులు ఇళ్లలో ప్రసరించేలా నిర్మాణాలను చేసుకున్నారు. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం వచ్చేలా ఇంటి నిర్మాణాలున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో వెలుగుకోసం నూనెదీపాలను ఉపయోగిస్తున్నారు.

వైదిక గ్రామమైన కూర్మ గ్రామస్తుల జీవన విధానం, అందరినీ రా రమ్మని ఆహ్వానిస్తుంది. ఆనాటి వాతావరణ పరిస్థితులు, పద్దతుల కారణంగా అనేక రుగ్మతలకు దూరం అయ్యారు. తమ జీవన విధానమే అందుకు ఉదాహరణ అని చాటుతున్నారు.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article