ఆవేశంలో ఆమె చేసిన తప్పు చివరకు ఆమె ఆత్మగౌరవానికే భంగం కలిగించేలా చేసింది. తోటి కార్మికులిపై చేయి చేసుకున్నంత మాత్రాన అందరి ముందు ఆమె కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించారు. దీంతో మనోవేధనకు గురైన ఆమె ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది. తన చేత అవమానకర రీతిలో కాళ్లు పట్టించారన్న మనస్తాపంతో మునిసిపల్ పారిశుధ్య కార్మికురాలు అదృశ్యమైన ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. దీంతో ఆమె తోటి కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల మధ్య దసరా మామ్మూళ్లు పంపకంలో ఏర్పడిన వివాదం మహిళా కార్మికురాలు అదృశ్యానికి కారణమైంది. మూడు నెలల క్రితం దసరా సందర్భంగా వసూలు చేసిన మామూళ్ల పంపకంలో వివాదం ఏర్పడింది. డబ్బులు పంపకంలో మోసం చేసిందని కోట శ్రావణి అనే కార్మికురాలు ఎద్దు కొండమ్మ అనే కార్మికురాలిపై ఆవేశంతో చేయి చేసుకుంది. అప్పట్లో ఈ విషయం మునిసిపల్ కమిషనర్ వరకు వెళ్లడంతో కొండమ్మకు క్షమాపణలు చెప్పించారు.
ఇదే విషయంలో కొందరు కార్మిక నాయకులు జోక్యం చేసుకుని తిరిగి కోట శ్రావణి చేత కొండమ్మ కాళ్ళు పట్టించి తిరిగి క్షమాపణలు చెప్పించారు. దీంతో శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం నుండి కనిపించకుండా పోయింది. శ్రావణి కోసం ఎంత గాలించినప్పటికీ కనిపించక పోవడంతో శ్రావణి తల్లి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మునిసిపల్ కార్మికుల మధ్య బయట వ్యక్తుల ప్రమేయం అధికంగా ఉందని శ్రావణి తల్లి లక్షమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించాలే కానీ ఇలా ఆత్మగౌరవం దెబ్బతినేలా కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించడం ఏంటని ప్రశ్నించింది..
చేసిన తప్పుకు బహిరంగ క్షమాపణలు చెప్పించిన చాలా రోజుల తరువాత తిరిగి కాళ్ళు పట్టించడం వల్లే తన కూతురు మనస్థాపంతో ఎటో వెళ్ళిపోయిందని, ఆమెకు ఏదైనా జరిగితే ఎద్దు కొండమ్మ, ఆమెకు సహకరించిన పెద్దలే బాధ్యత వహించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు జాడ కనిపెట్టాలని అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..