తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్స్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. కానూరులో బర్డ్స్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటు సీతానగరం మండలం, మిర్తిపాడులో కూడా బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది. మిర్తిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన కోళ్ల ఫారంలో ఒకే రోజు 8వేలుకు పైగా కోళ్లు మృతవాత పడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమై మిర్తిపాడు గ్రామాన్ని కిలోమీటర్ ఉన్న ఏరియాను రెడ్ జోన్‌గా.. ఆనుకుని ఉన్న 10 కిలోమీటర్ల ప్రాంతమంతా బఫర్ జోన్‌గా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. ఈ క్రమంలోని గ్రామమంతా కూడా పంచాయతి అధికారులు, వైద్య సిబ్బంది శానిటేషన్ పనిలో పడ్డారు. సీతానగరం మండలంలో చికెన్‌కు నో ఎంట్రీ అంటూ అధికారులు అనౌన్స్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోళ్ల ఫారంలో ఉన్న మిగిలిన కోళ్లను కూడా మృతవాత పడుతుండడంతో సమీపంలోని ఆరడుగుల గొయ్యి తీసి పూడ్చివేశారు అధికారులు.
డిస్టిక్ యానిమల్ అధికారి శ్రీనివాస్ సమక్షంలో చనిపోయిన కోళ్ల స్వాబ్స్ ద్వారా శాంపిల్‌ను కలెక్ట్ చేసి వైద్య పరీక్షలను వెటర్నరీ డాక్టర్లు నిర్వహించారు. ప్రస్తుతం మిర్తిపాడు గ్రామంలో కోళ్ల ఫారం ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కూడా అధికారులు అలెర్ట్ అయ్యారు. రెడ్ జోన్‌కి దగ్గరలో ఈ హైస్కూల్ ఉండడంతో ఉపాధ్యాయులు, అక్కడ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉదయాన్నే హైస్కూల్ ఆవరణలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు వైద్యులు. భోజనాల సమయంలో ఈగలు అధికంగా వాలుతున్నాయంటూ విద్యార్థులు, కోళ్ల ఫారం సమీపంలో ఉన్న స్థానికులు వెల్లడించారు. అధికారుల పర్యవేక్షణలో కోళ్ల ఫారంలోని మిగిలిన కోళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే 8000 పైగా కోళ్లు చనిపోగా.. ఫారంలో మిగిలిన కోళ్లుకు ఫీడ్ పెట్టడం మానేసారని, ఇదే తరహాలో చనిపోయే అవకాశాలున్నట్లు వెటర్నరీ వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే సమీప గ్రామ ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడం మానేస్తే మంచిదని సూచిస్తున్నారు అధికారులు. కోడిగుడ్లు కూడా తినకుండా కొన్ని రోజులు దూరంగా ఉండాలని మైక్‌లో ప్రచారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి