కొత్త పెన్షనర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు చేసింది. కొత్త పెన్షన్ల మంజూరు చేయటంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైపోయింది.
డిప్యూటీ సీఎంకు భారీ ఊరట..ఆ కేసు ఎత్తివేత..!
కొత్త పెన్షన్ల కోసం..
ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్దం అవుతోంది. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ పైన ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ విధానంతో పాటుగా వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వారి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తు దారులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై స్పష్టత వచ్చింది.
దరఖాస్తుల స్వీకరణ
దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా కాలంగా రకరకాల కారణాలతో కొత్త పెన్షన్లు ఆగిపోయాయని అదే విధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో, కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలాగా అనర్హులైన వారిని తీసేసే లాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ.. విచారణ.. ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. జన్మభూమి -2 జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోనే కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. వృద్ధాప్య, వితంతు పింఛన్‌తో పాటుగా అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇకపై 20 నిమిషాల్లోనే ఈసీ.. మీ చేతిలోనే ‘మీ సేవ’
కావాల్సిన డాక్యుమెంట్లు
దరఖాస్తు దారులు తమ అప్లికేషన్లతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆధార్, రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పని సరిగా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలని సూచించారు. వితంతు పెన్షన్లకు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు. వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అర్హత లేని వారిని తొలిగింపు అంశంలోనూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది.