చిన్న చిన్న సమస్యలకే కుంగిపోవడం …. బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచూ చూస్తున్నాం. అయితే చిన్న చిన్న కష్టాలకే కాదు పెద్ద సమస్యలను లెక్కచేయకుండా జీవన పోరాటాన్ని సాగిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు తమ కుటుంబాల కోసం ఎంతో శ్రమకోర్చి పని చేస్తుంటారు. సాధారణంగా వ్యవసాయ కూలీలుగా పనిచేసే అనేకమందిని మనం చూస్తుంటాం. మరోవైపు చిన్నచిన్న బుట్టల్లో పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు అమ్మేవారు ఆడవారు కూడా రోడ్లపై తారసపడుతుంటారు.
అయితే ఇప్పుడు పల్లెటూళ్లలో విరివిగా పండ్లు, కూరగాయలు లభిస్తున్నాయి. దీంతో ఒకే గ్రామంలో ఎక్కువగా బేరాలు చిక్కడం లేదు. అయితే ఆమె మాత్రం తనకు తెలిసిన వ్యాపారాన్ని సరికొత్తగా చేస్తూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటుంది. ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడుకు చెందిన చెన్నుబోయిన పద్మ జీవన సమరంలో ముందుకు సాగుతున్న తీరు పలువురికి స్పూర్తి దాయకంగా నిలుస్తోంది. పద్మ భర్త వ్యవసాయ కూలీగా ఉన్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. దీంతో భర్త సంపాదన కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. దీంతో తాను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్న పద్మ అరటి పళ్లు అమ్మే వ్యాపారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో అందరిలానే బుట్టలో పళ్లు పెట్టుకొని అమ్ముకునేది. రానురాను బేరాలు తగ్గిపోవడంతో ఇక లాభం లేదనుకొని ఒక సైకిల్ కొనుక్కుంది. దానికి రెండు అరటిగెలలు కట్టుకొని ప్రతిరోజూ ప్రతిపాడు చుట్టుపక్కల పల్లెటూర్లకి వెళ్లి అమ్మకాలు జరుపుతుంది. అక్కడ వ్యాపారం చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లల ఆలనాపాలనా చూస్తుంది. భర్తకి తోడుగా తన వంతు సాయం చేస్తున్నానంటుంది. పద్మ… ఇలా ఇద్దరూ కలిసి సంపాదించి దాచుకున్న సొమ్ముతో ఒక కూతురి పెళ్లి కూడా చేశారు. మరో ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు.
నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు. ఇద్దరూ ఆడపిల్లలను చదవించుకొని వారికి వివాహాలు చేయడమే తన లక్ష్యం అంటుంది పద్మ… అయితే పద్మ ఇలా సైకిల్‌పై అరటి పళ్ల వ్యాపారం చేయడం ఆ చుట్టుపక్కల పల్లెవాసులకు చిరపరిచితమే… చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎంతో మందికి పద్మ జీవితం మాత్రం స్పూర్తిదాయకమే…సమస్యలకు తల ఒగ్గని ఆమె ధైర్యం నేటి యువతకు మార్గదర్శకమే..