హస్తనలో అధికారాన్ని ఒడిసిపట్టి.. అగ్రరాజ్య పర్యటనకు బయలుదేరారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. 27 ఏళ్ల చరిత్రను తిరగరాసి మరీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇది ఆషామాషీ కాదు. దేశమంతా గెలిచినా అతిరథమహారధులు ఉండే హస్తినలో మాత్రం రెండున్నర దశాబ్ధాలుగా బీజేపీకి అధికారం అందనిద్రాక్షగానే మరింది. ఒక్కశాతం ఓటులేని త్రిపురలో దశాబ్ధం క్రితమే పగ్గాలు దక్కాయి. కానీ గతంలో అధికారాన్ని అనుభవించిన ఢిల్లీపై పట్టుచిక్కకపోవడం కమలనాథులకు ఓ రకంగా తలవంపుగానే మారింది. పార్టీకి చెందిన అగ్రనేత సుష్మాస్వరాజ్ చివరిసారిగా 1998లో అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మళ్లీ 27 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే బీజేపీ ఎలా గెలిచింది.. ఎందుకు గెలిచింది అన్న విశ్లేషణలు పక్కనపెడితే.. ఇప్పుడు మనం చర్చ చేయాల్సింది అరవింద్ కేజ్రీవాల్ గురించి.. ఆయన నిర్మించి నడిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ గురించి.. ఓ రకంగా ఇది కేజ్రీవాల్ ఓటమి.. ఆయన చేజాతులా కోరితెచ్చుకున్న అపజయం. కేజ్రీవాల్ రైజింగ్ నుంచి ఫాల్ వరకూ ఎన్నో కారణాలు..
కేజ్రీవాల్ రైజింగ్..
కేజ్రీవాల్ రాజకీయాల్లో అడుగుపెట్టడమే పెద్ద సంచలనం. 2011కి ముందు వెళితే అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్‌పాల్ కోసం సాగిన ఉద్యమంలో వాలంటీర్‌గా మొదలుపెట్టి ఢిల్లీ వీధుల్లో తనమార్కు చూపించారు. అన్నా హజారేతో పాటు వేదిక పంచుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో ఆయన ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పోరాటం కేవలం అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే.. రాజకీయ లక్ష్యం కోసం కాదంటూ ప్రకటించారు. కానీ మధ్యతరగతి ప్రజల్లో ఉండే భావన పసిగట్టగలిగారు. అప్పటికే మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయపార్టీ వైపు అడుగులువేశారు. రాజకీయమే ఇష్టం లేదన్న ఈ ఐఐటియన్‌కు అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ప్రభుత్వాల పట్ల ఉన్న నెగిటీవిటీని తనకు పాజిటీవ్‌గా మార్చుకున్నారు. చదువుకున్నవాళ్లు.. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండటం ఆయనకు కలిసివచ్చింది. సామాజికవేత్త యోగేంద్రయాదవ్, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, మనీష్ సిసోడియాతో కలిసి ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటుచేశారు. అన్నా హజారే రాజకీయపార్టీని వ్యతిరేకించినా కేజ్రీవాల్ మాత్రం వెనక్కతగ్గలేదు. అప్పటికే షీలా దీక్షిత్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఇక 2012లో జరిగిన గ్యాంగ్‌రేప్ మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఫలితంగా కేజ్రీవాల్ వ్యూహం ఫలించింది. రాజకీయపార్టీగా ఆయన విజయం సాధించారు. సంపూర్ణ మెజార్టీ రాకపోయినా కూడా అధికారపగ్గాలు అందుకున్నారు. కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇవ్వడంతో రెండేళ్ల పాటు సీఎంగా తన మార్కు చూపించారు. అయితే మధ్యలో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2015లో ఎన్నికలకు వెళ్లారు. మధ్యతరగతి ప్రజలతో పాటు రెండేళ్ల పాలనలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు, క్లీన్ ఇమేజ్ పేదలకు కూడా దగ్గర చేసింది. ఫలితంగా ఆయన 53.4శాతం ఓట్లతో ఏకంగా 67 సీట్లు గెలిచారు. 2013లో కాంగ్రెస్, ఆమాద్మీకి కలిపిన వచ్చిన మొత్తం ఓటుబ్యాంకును ఆయన ఒక్కరే కొల్లగొట్టారు. 2020లో కూడా ఆయనకు ప్రజలు పట్టం కట్టారు.
కేజ్రీవాల్ ఫాల్…
సిస్టమ్‌ని మారుస్తామని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్‌ను సిస్టమ్ పూర్తిగా మార్చేసింది. ఫలితంగానే 2025 ఢిల్లీ ఫలితాలు. ఇండియా కరప్షన్ అగెనెస్ట్ సంస్థ పెట్టినప్పుడు ఉద్యమాలకే పరిమితమవుతామని.. రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఆ తర్వాత పార్టీ పెట్టి మాటతప్పడం మొదలుపెట్టారు. అయితే ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి ఆయనకు పట్టం కట్టారు. అదేమీ పెద్ద విషయం కాదు..కానీ ఆయనలో మార్పు అప్పుడే మొదలైంది. సీఎంగా అధికారిక హోదాలో కూడా వ్యాగన్ ఆర్ కారులో తిరిగిన కేజ్రీవాల్ ఇటీవల కాలంలో SUVకి మారారు. ఇదొక్కటే కాదు మంత్రులు, ముఖ్యమంత్రికి కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు చాలవా అని బలంగా ప్రశ్నించిన కేజ్రీవాల్ చివరకు తన అధికార నివాసం శీష్ మహాల్ (అద్దాల మేడ) కోసం రూ.40 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శీష్ మహల్ రూపంలో ఆయనలో వచ్చిన కొత్త మార్పును అత్యంత చైతన్యవంతులైన ఢిల్లీ ప్రజలు గమనించారు. జన్ లోక్‌పాల్ కోసం నినదించిన కేజ్రీవాల్‌లో ఈ రకమైన యాంగిల్ సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆశించలేదు.. ఊహించలేదు..
జీరో బడ్జెట్ రాజకీయాలంటూ వచ్చిన కేజ్రీవాల్ చివరకు పంజాబ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీచేయడానికి లిక్కర్ పాలసీలను వాడుకుని పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలన్నది ఆప్ వాదస. అయితే నిజంగా కేజ్రీవాల్ ఆయన పార్టీ నేతలు స్కామ్ చేయకపోతే వ్యవహారం అరెస్టుల దాకా వచ్చేది కాదు. బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులైనా.. మమత బెనర్జీ, విజయన్, స్టాలిన్ వంటివాళ్లపై ఇలాంటి ఆరోపణలు రాలేదు.. ఎప్పుడూ అరెస్టు కాలేదంటే వాళ్ల క్లీన్‌చిట్‌తో ఉన్నట్టే కదా.. కానీ కేజ్రీవాల్ వాళ్లలాగా క్లీన్ ఇమేజ్‌ని కాపాడుకోలేకపోయారు. పైగా ఒకప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్.. తన విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా అరెస్టు అయిన వెంటనే రాజీనామా చేశారు. కానీ కేజ్రీవాల్ మాత్రం లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అనడం విమర్శలకు తావిచ్చింది. ఆయన ప్రజాస్వామ్య నిబద్ధతను కూడా ప్రశ్నించేలా చేసింది.
TV9 Managing Editor V Rajinikanth’s View Point
వారసత్వంపై ప్రేమ..!
జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ తన భార్య సునీతాను సీఎంగా చేయాలని బలంగా లాబీయింగ్ చేశారన్నది ప్రధాన విమర్శ. ఆమె కూడా అందుకు సంసిద్దత వ్యక్తం చేయడం బాహటంగానే కనిపించింది. అంటే రాజకీయాల్లో వారసత్వాన్ని కొనసాగించడానికి కేజ్రీవాల్ సిద్దపడ్డారని అర్థం. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లిన సమయంలో కేజ్రీవాల్ అధికారికంగా కూర్చునే చైర్‌లో నుంచి సునీత కేజ్రావాల్ ప్రకటన చేయడం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికలకు ముందు ప్రజా వ్యతిరేకత వస్తుందని చివరకు అతిశీని సీఎం చేశారు కేజ్రీవాల్. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన చివరకు వారసత్వం వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నించారు. అతిశీని సీఎంగా చేసినా కూడా ఆమె కేజ్రీవాల్ కూర్చున్న సీఎం సీటులో కూర్చోకుండా పక్కన చిన్నసీటులో కూర్చోవడం పార్టీలో ఉండే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించింది. కేజ్రీవాల్ పార్టీ సుప్రీం అయినా సరే.. ఆయనే సీఎం సీటులో కూర్చోవాలి.. వేరేవాళ్లకు ఆ అర్హత లేదన్నట్లు సాగడం ఏ నైతికవిలువలు చెబుతుంది.
రాజకీయ తప్పటడుగులు
ఇక కేజ్రీవాల్ చేసిన మరో అతిపెద్ద తప్పిదం ఆయన కాంగ్రెస్‌తో అంటకాగడం. రాజకీయ అనుభవరాహిత్యం కావొచ్చు.. పాలిటిక్స్‌లో సహజమేనని భావించి ఉండొచ్చు. ఢిల్లీలో ఆయన ఉద్యమం నడిపిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.. యూపీఏ2లో జరిగిన స్కామ్‌లను ఆయన జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. అటు ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కానీ అదే కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్నారు. అయినా ప్రజలు సుపరిపాలన అందిస్తారన్న నమ్మకంతో మళ్లీ 2015లో ఆప్‌ని సొంతంగానే గెలిపించారు. కానీ బీజేపీ అధినాయకత్వంలోని నరేంద్ర మోదీ, అమిత్‌షాలపై ద్వేషంతో కాంగ్రెస్ కూటమితో కేజ్రివాల్ జతకట్టారు. ఇండియా కూటమికి దగ్గరయ్యారు. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇండియా కరప్షన్ అగెనెస్ట్ నినాదమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రారంభించారు. కానీ రాజకీయాల్లో నిరంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటూ వచ్చారు.
Rahul Gandhi And Kejriwal
హద్దులు మీరిన సంక్షేమం..!
ప్రజలకు సంక్షేమం అవసరం.. కానీ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. కనీస అవసరాలు తీర్చడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు కేజ్రీవాల్. సురక్షిత మంచినీరు అందించే ప్రయత్నం చేశారు. మురికివాడల్లోనే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అవసరం. దీనిని ప్రజలు స్వాగతించారు. నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ స్కూల్స్‌లో సదుపాయాలు మెరుగుపరిచారు. ప్రైవేటుకు దీటుగా విద్యనందించి తన మార్కు చూపించారు. ఇది ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇక మురికివాడల్లో వైద్యానికి నోచుకోని పేదలకు మోహల్లా క్లీనిక్‌లు తీసుకొచ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్ తొలి ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు అందరిని ఆకర్శించాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. అయితే ఇదంతా సంక్షేమమే ప్రజలకు విద్య, వైద్యం ప్రాధమిక హక్కు. అందించడం ప్రభుత్వ బాధ్యత కూడా. చేయడాన్ని అంతా స్వాగతించారు. ఉన్నత విద్యావంతుడు అయిన కేజ్రీవాల్ కూడా దేశమంతా వ్యాప్తి చెందిన ఉచిత తాయిలాల ట్రాప్‌లో పడ్డారు. గెలుపు ఒక్కటే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఉచితాలు పనిచేసి ఉండొచ్చు దీనికి కారణం అక్కడ ఉండే పేదరికం, నిరక్షరాస్యత. కానీ ఢిల్లీ ఇందుకు పూర్తిభిన్నమైన రాష్ట్రం. ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బులను పప్పుబెల్లాల్లా పంచిపెడతామంటే జనాలు సహిస్తారా.. అక్కేడ వేతనజీవులు, పన్నులు చెల్లించే చిరువ్యాపారులు కేజ్రీవాల్‌కు దూరమయ్యారు. 54శాతం నుంచి 43శాతానికి ఓట్లు పడిపోవడానికి కారణం అదే. ఆప్‌కి ఏకంగా పది శాతం ఓట్లు పడిపోయాయి. వారి ఆగ్రహానికి కేవలం ఉచిత పథకాలే కాదు.. నగరంలో తగ్గిస్తామన్న ట్రాఫిక్ తగ్గలేదు. ఇక పోల్యూషన్ కంట్రోల్ ఎక్కడా లేదు. యుమునా నది ప్రక్షాళనపై హామీలకే పరిమితం అయ్యారు. ఇవన్నీ కూడా కేజ్రీవాల్‌ను మొదట్లో భుజానికి ఎత్తుకున్న వర్గాలను మళ్లీ దూరం చేశాయి.
కేజ్రీవాల్ ముందున్న సవాళ్లు…!
ఓ దశలో మోదీకి ప్రధాన ప్రత్యర్ధి కేజ్రీవాల్ అంటూ ప్రచారం సాగింది. అదే ధీమాతో ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఏకంగా మోదీపైనే పోటీచేశారు. కానీ ఓటమిచెందారు. గుజరాత్, గోవా సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎక్కడా ఆయనకు ఆదరణ దక్కలేదు. ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్‌లో మాత్రమే విజయం వరించింది. అక్కడ పరిస్థితులు భిన్నమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. రైతులకు బీజేపీ వ్యతిరేకమన్న భావన బలంగా ఉంది. ఫలితంగా అక్కడ ప్రత్యామ్నయంగా ఆప్‌ను ఎన్నుకున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా కేజ్రీవాల్ ముందున్న అతిపెద్ద సవాలు.
మొత్తానికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ విఫలం అయ్యారు. ఫలితం 2025 ఎన్నికల్లో 22 స్థానాలకు పరిమితమై అధికారం కోల్పోయారు. ఆనతికాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కేజ్రీవాల్.. మళ్లీ పూర్వవైభవం సాధించగలరా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.