వివిధ రంగాల్లో అసాధారణమైన విశిష్ట సేవలను అందించిన వారి గౌరవార్ధం భారత ప్రభుత్వం ఈ భారతరత్న (Bharat Ratna) అవార్డులను ప్రకటిస్తుంది. ఇది దేశంలో అత్యున్నత పౌరపురస్కారం. గతేడాది రికార్డు స్థాయిలో ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, మన తెలుగు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్న వరించింది. ఈ ఏడాది కూడా కొందరికి భారత రత్న ప్రకటించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. రతన్ టాటా, మన్మోహన్ సింగ్‌తో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం తదితరులు భారత రత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత రత్న పతకం గురించి ఈ అసక్తికరమైన విషయాలు మీ కోసం..
అది బంగారు పతకం కాదు..
ఈ పురస్కారంతో అందుకునే వారికి ప్రశంసాపత్రం, మెడల్ తో పాటు ప్రభుత్వం మరెన్నో సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. కొన్ని ప్రాధాన్యతలను కూడా ఇస్తుంది. ప్రత్యేక ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా వారికి ఆహ్వానం అందుతుంది. ఈ పురస్కారం వేడుకలో పాల్గొనడమే గర్వకారణంగా భావిస్తారు. ఇక రాష్ట్రపతి చేతుల మీదుగా భారత రత్న పతకాన్ని మెడలో ధరించిన సమయం ఎంతో ఉద్విగ్నతకు లోనవుతారు. ఇందులో అందించే మెడల్ ను పలువురు తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు. అయితే దీనిని చూడగానే సహజంగా అంతా అనుకునేది ఇది బంగారు పతకం అయ్యుంటుందని.. కానీ అది నిజం కాదు.
రాగికి మెరుగులద్ది..
భారత రత్న పతకం తయారీకి వెండి, బంగారం వంటి విలువైన లోహాలను అసలే వాడరట. ఈ మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో అందించిన సమాచారం మేరకు తెలుస్తోంది. భారత రత్నకు ఎంపికైన వారికి రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికెట్ ను ఇస్తారు. అలాగే దీంతో పాటు ఇచ్చే మెడల్ రావి ఆకు ఆకారంలో ఉండి దానిపై సూర్యుడి ఆకారం మరోవైపు మూడు నాలుగు సింహాల గుర్తు దాని కింద సత్యమేవ జయతే అని హిందీలో రాసి ఉంటుంది. అయితే దీని తయారీకి స్వచ్ఛమైన రాగి లోహాన్ని వాడటం విశేషం. దీని పొడవు 5.8 సెం.మీ, వెడల్పు 4.7 సెం.మీ, 3.1 సెం.మీ మందంతో తయారు చేస్తారు. పైపూతగా ఆకుపై ఉన్న సూర్యుడి చిత్రానికి ప్లాటినంతో తయారు చేస్తారు.
దేశంలో ఒక్కచోటే తయారీ..
భారత రత్న పతకాలను దేశంలో ఒకే చోట తయారు చేస్తారు. ఈ బాధ్యతను భారత ప్రభుత్వం కోల్ కతా మింట్ కు అప్పగించింది. అనుభవజ్ఞులైన కళాకారులతో దీనిని తయారు చేయిసతారు. 1757లో కోల్ కతా మింట్ ను స్థాపించగా అప్పటి నుంచే దీని తయారీని ఇక్కడే చేస్తున్నారు. భారత రత్న ఒక్కటే కాదు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మ శ్రీ, పరమవీరచక్ర వంటి అన్ని ఇతర అవార్డులను కూడా మింట్ లోనే తయారు చేయిస్తుంది భారత ప్రభుత్వం.