ఉత్తరాంధ్ర మణిహారంగా చెప్పుకునే భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను సవాలుగా తీసుకొని పరుగులు పెట్టిస్తుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 జూన్ నెల నాటికి ఎయిర్ పోర్ట్ నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. 2,203 ఎకరాల్లో రూ.4,750 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని జీఎమ్ఆర్ సంస్థ చేపట్టింది.
జీఎమ్ఆర్ సంస్థ ఇప్పటివరకు టెర్మినల్, రన్వే, ఏటీసీతో పాటు పలు సుందరీకరణ పనులు కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. ఇప్పటివరకు ఎర్త్ వర్క్ 99 శాతం జరగగా, రన్వే పనులు 65శాతం, టెర్మినల్ పనులు 38.59 శాతం, ఏటీసీ పనులు 43.94 శాతం పూర్తి కాగా, ఇతర నిర్మాణ పనులను కూడా వేగంగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2026వ సంత్సరంలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లైట్స్ టేకాఫ్ అయ్యేలా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అయితే ఎయిర్ పోర్ట్ నిర్మాణం జోరుగా సాగుతున్నప్పటికీ ఎయిర్ పోర్ట్ కి అనుసంధానంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంకి వెళ్లేందుకు కావాల్సిన కనెక్టివిటీ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది.
అందుకోసం ఎయిర్ పోర్ట్ వద్ద ఎనిమిది ఎకరాల్లో నిర్మించాల్సిన ట్రంపెట్ భూసేకరణ కూడా అధికారులు పూర్తి చేశారు. అయితే ట్రంపెట్ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ట్రంపెట్ నిర్మాణం పూర్తయితే ఎయిర్ పోర్ట్ నుండి రోడ్ కనెక్టివిటీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్డు కనెక్టివిటీ పనులు కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో దూకుడు ఇలాగే కొనసాగితే మరికొద్ది నెలల్లోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే ఇక్కడ నుండి ఏడాదికి అరవై లక్షల మంది ప్రయాణికులు, పదివేల టన్నుల కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్గో సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత దోహదపడే అవకాశాలు ఉన్నాయి.