ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 1996 తర్వాత తొలిసారిగా పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్. అంతకుముందు 1996లో ప్రపంచకప్‌కు పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను సక్సెస్ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ టోర్నీ కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అందుకు తగిన పారితోషికం కూడా అందుకోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్ స్టేడియాలను పునర్నిర్మించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా రెండు స్టేడియాల పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 5కు సిద్దం చేయనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లు కూడా ఈ కొత్త స్టేడియంలలోనే జరగనున్నాయి.
జనవరి నెలాఖరులోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 5న పీసీబీకి అప్పగిస్తామని కరాచీ నేషనల్ స్టేడియం జనరల్ మేనేజర్ అర్షద్ ఖాన్ తెలిపారు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పరిస్థితి కూడా ఇదే. ఈ రెండు స్టేడియాలు, రావల్పిండి స్టేడియం పునరుద్ధరణ కోసం పీసీబీ 12 బిలియన్ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇది భారతీయ రూపాయలలో 3.72 బిలియన్లు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో అనేక మార్పులు జరిగాయి. ఐదు అంతస్తుల భవనం, అత్యాధునిక సౌకర్యాలు, ICC అవినీతి నిరోధక యూనిట్, డోపింగ్ నిరోధక యూనిట్‌తో సహా ఫిజియోథెరపీ గదులు, మ్యాచ్ అధికారుల గదులు, రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉన్నాయి.
మరోవైపు కార్పోరేట్ బాక్సుల సంఖ్యను కూడా పెంచామని, ఇప్పుడు వాటిలో సుమారు 1000 మంది కూర్చోవచ్చని అర్షద్ చెప్పారు. అభిమానుల కోసం స్టేడియంలో కొత్త కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. సీట్ల సంఖ్యను కూడా పెంచడంతో పాటు కొన్ని కొత్త టాయిలెట్లను కూడా సిద్ధం చేశారు. సాధన కోసం ఔటర్ నెట్‌లో ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు కూడా చేశారు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కూడా ఇలాంటి సౌకర్యాలను జోడించారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అయితే.. అటు పీసీబీకి కొట్లు వచ్చిపడటమే కాదు.. ఐసీసీ నుంచి నజరానా అందనుందట.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి