ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి సంబరాలు చేసుకుంటోంది కాషాయసేన. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత.. హస్తిన అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీ… తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చర్చోపచర్చలు జరుపుతోంది. దీంతో, కీలకమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేది పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం? అంటూ అప్పుడే రాజకీయవర్గాలు డిస్కషన్ మొదలెట్టేశాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికే ఆ కుర్సీ దక్కుతుందా? లేక సామాజిక, ప్రాంతీయ సమీకరణలు లెక్కలోకి తీసుకుంటున్నారా? అన్నదే సస్పెన్స్‌గా మారింది. అంతేకాదు, మరోసారి లేడీస్ సెంటిమెంట్‌ను కూడా తెరమీదకు తెస్తున్నట్టు కనబడుతోంది. ఇలా ఢిల్లీ బాద్‌షా ఎవరు? CM కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? ప్రధాని మోదీ మనసులో ఎవరున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది..
ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి పదవికి ఎవరైతే బాగుంటారు..? అనేదానిపై బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. ఢిల్లీ కొత్త CM ఎంపిక కోసం బీజేపీ సీనియర్ నేతలతో ప్రధాని మోదీ శనివారం రాత్రి చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు, ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన- అమిత్ షా, BL సంతోష్‌తో మంతనాలు జరిపారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలతో అమిత్ షా, నడ్డా వేర్వేరుగా చర్చలు జరిపారు. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతోపాటు పలువురు నేతలు ఉన్నారు. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు CM పీఠం దక్కుతుందా.. లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ మార్క్ ఈసారి ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ అగ్రనేతలు.. సాయంత్రం 5గంటలకు ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్‌దేవా ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బైజయంత్ పాండా, బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు.. కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయడంతోపాటు.. కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ CMపై నిర్ణయం తీసుకుంటారా లేక వేచిచూస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ
ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేసులో… పలువురు కీలక నేతల పేర్లు వినబడుతుండగా.. . బీజేపీ హైకమాండ్.. వారిలో ఎవరికి దిల్లీ పగ్గాలను అప్పగిస్తుందన్నదే ఆసక్తిరేపుతోంది. ప్రధానంగా ఈజాబితాలో గట్టిగా వినిపిస్తున్న పేరు పర్వేశ్ వర్మ. ఈయన పేరు ఇంత బలంగా వినిపించడానికి బలమైన కారణమే ఉంది. న్యూఢిల్లీ స్థానంలో బరిలో నిలిచిన పర్వేశ్.. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన ‘జాట్’ సామాజికవర్గానికి చెందిన పర్వేశ్.. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు. 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే ఏడాది ఢిల్లీలోని మెహ్రౌలీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ జాట్ వర్గం నేతను ముఖ్యమంత్రిని చేయడం వల్ల గ్రామీణ ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆ వర్గం ఓటర్లకు సందేశం ఇచ్చినట్టవుతుందని.. పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపొందిన వెంటనే పర్వేశ్ వర్మ… అగ్రనేత అమిత్‌షాను కలవడం విశేషం. దీంతో, ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
రేసులో సతీష్ ఉపాధ్యాయ్
రేసులో వినిపిస్తున్న మరో పేరు సతీష్ ఉపాధ్యాయ్. బీజేపీ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ‘బ్రాహ్మణ’ వర్గానికి చెందిన ఈయన.. ఢిల్లీ యువ మోర్చా అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం NDMC వైస్ చైర్మన్‌గా ఉన్న సతీష్‌కు… పరిపాలనాపరమైన అనుభవం ఉండటం ప్లస్ పాయింట్. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాదు… ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఉండం ఆయనకు అదనపు బలంగా చెప్పవచ్చు.
పంజాబీనేతకు అవకాశం ఇస్తారా?
పంజాబీనేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఆ రాష్ట్రంలోనూ ఆప్‌కు చెక్ పెట్టాలనుకుంటున్న బీజేపీ… ఆశిష్ సూద్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్న ఈ పంజాబీ నాయకుడు.. పార్టీ జనరల్ సెక్రటరీగా, ప్రస్తుతం గోవా ఇన్‌చార్జ్‌గా, జమ్మూ కశ్మీర్ కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆశిష్‌సూద్‌కు.. కేంద్ర నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.
తెరపైకి వైశ్యనేతలు జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్త
ఈ లిస్టులో వినిపిస్తున్న మరో ప్రముఖ పేరు జితేంద్ర మహాజన్. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఈ నాయకుడికి.. RSSతో సత్సంబంధాలున్నాయి. ఈ ఒక్క బలమైనకారణం.. ఆయణ్ని సీఎం సీటువైపు నడిపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో నాయకుడు విజేందర్ గుప్తా పేరు సైతం.. ఢిల్లీ సీఎం రేసులో బలంగానే వినిపిస్తోంది. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన సైతం.. ‘వైశ్య’ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆప్ హవాలోనూ.. అప్పట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు.
రమేష్ బిధూరి.. కైలాశ్ గహ్లోత్
వీళ్లే కాదు.. మరికొందరు నేతల పేర్లు కూడా.. ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయ్. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రమేశ్ బిధూరి.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపై పోటీ, ఓడించినంత పనిచేశారు. భాజపా ఆయనవైపు మొగ్గుచూపుతుందో లేదోనన్నది ఆసక్తిరేపుతోంది. జాట్ వర్గానికి మరో నేత కైలాశ్ గహ్లోత్.. పేరు కూడా బలంగా ప్రతిధ్వనిస్తోంది.
ఢిల్లీ పీఠంపై మహిళ కూర్చుంటారా?
పురుషనేతల రేసును పక్కనపెడితే.. ఢిల్లీ సీఎం పీఠంపై మరోసారి మహిళానేత కూర్చుంటారా? అనే చర్చ కూడా జోరందుకుందిప్పుడు. ఢిల్లీకి గతంలో బీజేపీ తరపున సుష్మాస్వరాజ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే… కాంగ్రెస్ తరపున దివంగత షీలాదీక్షిత్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆ తర్వాత ఆప్ ఆధ్వర్యంలోనూ ఢిల్లీకి మహిళా సీఎం సేవలు దక్కాయి. పలు కేసుల్లో అరెస్టయిన కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతిశీ. ఇప్పుడు ఆప్ తరపున ఆమే ప్రతిపక్ష నాయకురాలు అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.
సీఎం రేసులో బన్సూరి స్వరాజ్.. స్మృతీ ఇరానీ
ఒకవేళ మహిళానేతను సీఎం కుర్చీపై కూర్చోబెడితే.. ఆ అవకాశం ఎక్కువగా భాజపా ఎంపీ బన్సూరీ స్వరాజ్‌కు ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బన్సూరి.. న్యూదిల్లీ ఎంపీగా గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. దీంతో, మహిళాకోటాలో ఆమెకు ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక, ఇదే కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతిఇరానీ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే.. కాషాయ పార్టీ నుంచి మరోసారి దిల్లీకి మహిళా ముఖ్యమంత్రి సేవలు దక్కుతాయన్నమాట. అయితే ఎంతమంది పేర్లు రేసులో వినిపిస్తున్నా… బీజేపీ అధిష్ఠానం మనసులో ఏముందన్నదే ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..