Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని ఈసారి ఎలాగైనా ఓడించాలని భారతీయ జనతా పార్టీ (BJP) కంకణం కట్టుకుంది. దీని కోసం ఎన్నికల్లో అన్ని అస్త్రాలనూ కమలనాథులు ప్రయోగిస్తున్నారు. గత దశాబ్దకాలంలో ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు భిన్నమైన తీర్పులిస్తున్నారు. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 2015లో 67, 2020లో 62 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు.. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీజేపీకే కట్టబెడుతూ వచ్చారు. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండి కూటమి (I.N.D.I.A)లో భాగంగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసినా సరే బీజేపీని నిలువరించలేకపోయాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలు అనేసరికి ఓటర్లు ఆప్ వైపే మొగ్గుచూపుతుండడంతో.. బీజేపీ ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం ఆ పార్టీకి ధీటుగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. అందులో పేద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ, హోళీ, దీపావళి సమయాల్లో ఉచిత సిలిండర్, గర్భిణీ మహిళలకు రూ 21,000 సహా అనేక హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే ఎన్నికల్లో గెలవాలంటే ఇవి మాత్రమే సరిపోవు.. ఇంకా చాలా చాలా వ్యూహాలు కావాలి..
పొత్తులతో చిత్తు చేసేనా?
రాజకీయాల్లో ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు రెండు, మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం సహజం. తద్వారా వ్యతిరేక ఓటు చీలకుండా అడ్డుకోవచ్చు. కలిసి పోటీ చేసే పార్టీల ఓటుబ్యాంకులు కలిసి ప్రత్యర్థిని ఢీకొట్టవచ్చు. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీలో ఒకప్పుడు పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ ఓటుబ్యాంకును పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు వంటి పథకాలతో న్యూట్రల్ ఓటుబ్యాంకును కూడా కొల్లగొట్టింది. బీజేపీ తన ఓటుబ్యాంకును కాపాడుకుంటున్నప్పటికీ.. విజయానికి అది సరిపోవడం లేదు. అందుకే ఈసారి కేజ్రీవాల్‌కు ధీటుగా పథకాలను ప్రకటించడంతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు కూడా పెద్దపీట వేసింది.
ఢిల్లీలో నివసించే జనాభాలో అధికశాతం పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారే. తూర్పు యూపీ, బిహార్, జార్ఖండ్ ప్రాంత ప్రజలను పూర్వాంచలీలుగా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతం నుంచి ఉపాధి కోసం దేశ రాజధానికి వచ్చి స్థిరపడ్డవారు దాదాపు మూడో వంతు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న పూర్వాంచలీలు ఎటువైపు మొగ్గితే అటు విజయం తథ్యం. పూర్వాంచల్ ప్రజలు ఘనంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ వేళ ఎన్నికలు రావడంతో ఆ వేడుకల జోరు ఢిల్లీలో పెరిగింది. వాటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల హడావుడి కూడా పెరిగింది. అంతే కాదు.. పూర్వాంచల్ ప్రాంతంలో బలమైన రాజకీయ పార్టీలను కూడా బీజేపీ రంగంలోకి దించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీలతో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయించడంతోనే సరిపెట్టలేదు. రెండు సీట్లను కేటాయించి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామిని కూడా చేసింది. తద్వారా పొత్తు ధర్మం పాటిస్తూ.. పూర్వాంచల్ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్‌కు ఇదొక గుణపాఠం
పొత్తు ధర్మం, మిత్ర ధర్మం పాటించడంలో కాంగ్రెస్ పార్టీ తన కుటిల నీతిని ప్రదర్శిస్తూ మిత్రపక్షాలకు దూరమవుతూ వస్తోంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మిత్రపక్షాలు, లేదంటే వాటి అవసరమే లేదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో 3 సీట్లు ఇచ్చి మిత్రధర్మాన్ని చాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, పొరుగు రాష్ట్రం హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎగనామం పెట్టింది. “పొత్తు లేదు.. చిత్తు లేదు ఫో” అంటూ ఆప్‌ను దూరం పెట్టింది. గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీకి చోటివ్వకుండా ఇలాగే వ్యవహరించింది.
ఇక ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేకపోగా.. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‍వాదీ పార్టీ (SP) కూడా కాంగ్రెస్‌ను కాదని తమ మద్దతు ‘ఆప్’కే అని తేల్చి చెప్పాయి. ఇదే సమయంలో బీజేపీ తన మిత్రపక్షాలైన జనతాదళ్ – యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి – రామ్ విలాస్ పాశ్వాన్ (LJP-RV) పార్టీలకు చెరొక సీటు కేటాయించింది. నిజానికి ఆ పార్టీలకు ఢిల్లీలో పోటీ చేసేంత శక్తి, సామర్థ్యాలేవీ లేవు. కానీ పూర్వాంచల్ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. పూర్వంచల్ ప్రాంత ప్రజలు ఢిల్లీలో గణనీయమైన సంఖ్యలో ఉన్నందున.. వారిని ఆకట్టుకోవడం కోసం ఈ ఎత్తుగత వేసింది. బురాడి స్థానంలో జేడీ(యూ) పోటీ చేస్తుండగా.. దేవలీ స్థానం నుంచి ఎల్జేపీ (ఆర్వీ) పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీలు తమ తమ పార్టీ గుర్తులైన బాణం, హెలికాప్టర్‌పై పోటీ చేస్తున్నాయి.
పూర్వాంచలి ఓటర్ల ప్రాముఖ్యత
ఢిల్లీలో పూర్వాంచలి ప్రజల మద్దతు రాజకీయ పార్టీల విజయానికి చాలా కీలకం. కొన్ని నివేదికల ప్రకారం దేశ రాజధానిలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాల్లో పూర్వాంచలిలు లేదా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన ప్రజలు సంఖ్యాపరంగా ఇతర జనాభా కంటే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఢిల్లీ నగర జనాభాలో దాదాపు 30 శాతం మంది పూర్వాంచలీలేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్వాంచలిలు ఒకే పార్టీకి సామూహికంగా ఓటు వేస్తారని భావించడానికి లేదు. కులం, మతం, ఇతర అనేక అంశాల ఆధారంగా వారి ఓట్లు చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ.. పూర్వాంచలీలు బలమైన ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్నారు. అందుకే బీజేపీ వారిని ఆకట్టుకోడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
బీజేపీ నిర్ణయం కేవలం ఢిల్లీ ఎన్నికల వరకే పరిమితం అనుకోడానికి వీల్లేందు. ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్, వామపక్ష పార్టీల నుంచి ఎన్డీఏ కూటమికి గట్టి సవాలు ఎదురుకానుంది. లక్షల సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్న బిహారీల మద్దతు కూడగట్టగల్గితే.. అది బిహార్ ఎన్నికల్లోనూ ఉపయోగపడుతుందని కమలదళం భావిస్తోంది.