దేశంలో ఆర్థిక నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రజల అత్యాశను ఆసరగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రూపాయి ఆశచూపి పది రూపాయాలు లాగేస్తున్నారు. అయితే దీనికి పేద, మధ్య తరగతికి చెందిన సామాన్య ప్రజలే పరిమితం కావడం లేదు. సెలబ్రిటీ కుటుంబాలు సైతం బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటాణనీ తండ్రిని కొందరు నేరగాళ్లు మోసం చేశారు.
నమ్మించి ఏకంగా రూ. 25 లక్షలు దోచేశారు. అయితే చివరికి తాను మోసపోయాయని తెలిసిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్‌గా పదవి విరమణ చేశారు. అయితే విరమణ అనంతరం ప్రభుత్వ కమిషన్‌లో సీనియర్ పదవి ఇప్పిస్తామని కొందరు జగదీష్‌ను సంప్రదించారు.
అందుకోసం రూ. 25 లక్షలు చెల్లించాలని తెలిపారు. దీంతో వారిని గుడ్డిగా నమ్మిన జగదీష్ పటానీ.. వెనకా ముందు ఆలోచించకుండా మొదట రూ.5 లక్షల నగదు రూపంలో, మరో రూ. 20లక్షల వరకు మూడు వేర్వేరు బ్యాంకు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత నిందితులు ముఖం చాటేశారు. దీంతో తాను మోసయోనని అర్థం చేసుకున్న జగదీష్ పోలీసులను ఆశ్రయించారు.
ఇందులో భాగంగా శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్, మరో గుర్తుతెలియని వ్యక్తిపై మోసం, క్రిమినల్ బెదిరింపు, దోపిడీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేటా ప్రారంభించారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సీనియర్ ప్రభుత్వ పదవుల్లో ఒకటి ఇస్తామని పటానీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెలబ్రిటీల కుటుంబాలకు చెందిన వారిని కూడా నేరగాళ్లు వదలకపోవడం చర్చకు దారి తీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..