టెక్ బిలియనీర్ ఎలాన్‌మస్క్ భారత్, అమెరికా రిలేషన్ చక్కగానే ఉన్నాయనే సిగ్నల్స్ ఇచ్చారు. ఇటీవల టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల డెలిగేషన్‌కు చక్కటి ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో ఇరు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్ పెంపొందించేందుకు తన సపోర్ట్ ఉంటుందన్నారు.
ఈ మీట్‌లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో జయ్ కోటక్ (కోహెడ్ – కోటక్ 811), ప్రశాంత్ రుయా (డైరెక్టర్ – ఎస్సార్ క్యాపిటల్), కళ్యాణ్ రామన్ (సీఈఓ – ఫ్లిప్‌కార్ట్), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), నీలేష్ వేద్ (ఛైర్మన్ – అప్పారెల్ గ్రూప్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ – ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.
ఈ ఆతిథ్యంలో భాగంగా మన వ్యాపారవేత్తలు స్పేస్ ఎక్స్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడానికి.. అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ వ్యాఖ్యానించారు.
ఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘ సాంకేతికంగా స్థిరమైన భవిష్యత్తును రూపకల్పన చేయడంలో భారత్‌కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ మీటింగ్ నిదర్శనమన్నారు. డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రెసిడెంట్ పగ్గాలు చేపడుతున్న సమయంలో ఫలవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కో-ఛైర్మన్‌గా మస్క్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..