Health: ఏదో పిచ్చి మొక్క అనుకుంటే మీరే పిచ్చోళ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత మూలిక

2 hours ago 1

ప్రాచీన భారతీయులకు అందాన్ని ఆరోగ్యాన్ని ఆయువును అందించిన అమృత ఔషథం- గుంటగలగర. ఆకలి కోల్పోయిన వారికి ఇది అమృతం వంటిది. ఇది మందగించిన కంటిచూపును పెంచడమే కాక పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది. ఊడిపోయిన, నెరసిన, పలుచగా మారిన తలజుట్టును తిరిగి నల్లగా దృఢంగా వచ్చేలా చేస్తుంది. ఇది నాశికలో శ్వాసకు అడ్డుపడే చెడు కఫాన్ని, నాశికలో పెరిగే కొయ్య కండరాలను కరిగిస్తుంది. ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం, ప్లీహం వంటి అవయవాలకు ప్రాణం పోసి రక్తాన్ని శుద్ధి చేసి, వృద్ధి చేస్తుంది. అంతేకాదు చర్మంపై మచ్చలు, ముడతలు పోగొడుతుంది. దీన్ని ఒక సంవత్సరంపాటు వాడటం వల్ల సర్వవ్యాధులను నివారిస్తుంది.

గుంటగలగర మొక్కలు నీటి ఒడ్డున, పంట పొలాల గట్లపైన ఎక్కడపడితే అక్కడ వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతాయి. భూమిపైన ఒకటి నుండి రెండడుగుల ఎత్తు వరకు పెరుగుతూ వీటి కాండం, కొమ్మలపైన తెల్లని నూగు ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధులకు దివ్యౌషథం:

ఇది కారము, చేదు రుచులతో, ఉష్ణ స్వభావంతో రసాయనసిద్ధిని కలిగించే అమృతగుణం కలిగి ఉండటంవల్ల అన్నిరకాల కఫ, వాత రోగాలను నివారిస్తుంది.

  • (1) గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలికమైన తలనొప్పి, తలబరువు, మెదడు బలహీనత, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు నివారించబడతాయి.
  • (2) గుంటగలగర ఆకుల రసం, నువ్వులనూనె సమంగా కలిపి పాత్రలో పోయాలి. చిన్న మంటపైన రసమంతా ఇగిరిపోయి, నూనె మిగిలే వరకూ మరిగించాలి. ఆ తర్వాత దించేసి, వడపోయాలి. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రెండుపూటలా ఈ తైలాన్ని రెండు ముక్కులలో ఐదు చుక్కల మోతాదుగా వేసి, పీలుస్తుంటే నాశికా వ్యాధులు తగ్గడమేగాక దృష్టి, జుట్టు పెరుగుతాయి.

నోటి రోగాలకు:

గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి, నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకొని ఐదు నుండి పదినిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత, నాలుకపూత, నాలుకపై పగుళ్ళు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి.

కడుపునొప్పికి:

వయసును బట్టి ఐదు నుండి పది గ్రాములు ఆకుల్ని తీసుకొని, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి. దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా భోజనానికి గంటముందు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం తగ్గుతాయి.

చర్మవ్యాధులకు చక్కని మందు:

ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి. లేదా గుంటగలగర వేళ్లు, వేళ్ళ పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపుకొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.

అతి వేడి, మంటలు, నొప్పులకు:

మట్టి మూకుడులో శుభ్రంచేసిన వామువేసి అది మునిగే వరకూ గుంటగలగర ఆకుల రసం పోసి, రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఆ పాత్రను ఎండలో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే సాయంత్రానికి రసమంతా గింజలలోకి ఇంకి పోతుంది. దీన్ని బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఆ గింజల్ని పొడి చేసి, జల్లెడపట్టి నిల్వ చేసుకోవాలి. కప్పు మంచినీటిలో పావుచెంచా పొడి వేసి, బాగా కలిపి రెండుపూటలా భోజనానికి గంట ముందుగా తాగాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల పైథ్యం, ఉద్రేకం తగ్గుతాయి. అందుకు కారణమైన కాలేయము (లివర్‌) సహజస్థితికి చేరుతుంది. అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్ళు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదాలు పగలడం మొదలైన సమస్యలన్నీ తగ్గుతాయి.

కాలేయ, ప్లీహ వ్యాధికి:

ఆకులు, కొమ్మలు కడిగి, దంచి వడపోసిన రసం రోజూ రెండుపూటలా భోజనానికి గంట ముందుగా పావుకప్పు చొప్పున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయ వాపు, ప్లీహ వాపు తగ్గి పోతాయి. దీనివల్ల రక్తం శుద్ధవుతుంది. వృద్ధి కూడా చెందుతుంది. చర్మ రోగాలు, మలబద్ధకం, నపుంసకత్వం మొదలైన వ్యాధులూ సమసిపోతాయి. కుష్టురోగం కూడా సంవత్సర కాలంలో పూర్తిగా తగ్గుతుంది. అయితే కుష్టు వ్యాధిగ్రస్తులు ఆవు పాలతో మాత్రమే తీసుకోవాలి.

ముక్కు రోగాలకు:

పైన తెలిపిన విధంగా గుంటగలగర ఆకుల రసం రెండుపూటలా మూడు, నాలుగు చుక్కల మోతాదులో ముక్కులలో వేసి పీలుస్తూ ఉంటే ముక్కుల నుండి చెడిపోయిన కఫం నీటిలాగా కారిపోయి, శ్వాస క్రమబద్ధమై, శ్వాస సంబంధ రోగాలు తగ్గుతాయి.

కండ్లకలకకు:

పచ్చి ఆకులను దంచి తీసిన రసం బట్టలో వడకట్టి ఒకటి లేక రెండు చుక్కలు రెండుపూటలా కళ్ళల్లో వేస్తుంటే కండ్లకలకలు, దానివల్ల ఏర్పడిన మంటలు, నొప్పులు, ఎరుపుదనం రెండు, మూడు రోజుల్లో తగ్గుతాయి.

ఆకలి పెరగడానికి:

ఆకులను కొంచెం నీటితో కలిపి, దంచాలి. అలా వచ్చిన రసాన్ని వడపోయాలి. దీన్ని పావుకప్పు తీసుకొని అందులో మూడు చిటికెలు ఉప్పు, దోరగా వేయించిన మిరియాల పొడి, రెండు చెంచాల నిమ్మరసం కలిపి రెండుపూటలా భోజనానికి గంట ముందు తాగితే రెండు, మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది.

దేహ పటుత్వానికి:

గుంటగలగర మొక్కలను దంచి తీసిన రసం ఒక నూలుబట్టలో వడపోసి దీనిని పావుకప్పు నుండి అరకప్పు మోతాదుగా తాగాలి. ఆ వెంటనే ఒక కప్పు ఆవుపాలల్లో చెంచా పటికబెల్లం పొడి కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు తీసుకుంటే నెలరోజుల్లోనే అనూహ్యమైన దేహదారుఢ్యం కలుగుతుంది.

ఆహారంగా:

ఎన్నో వ్యాధులను అతి సులువుగా నివారించ గల ఔషధశక్తి ఈ మొక్కల్లో ఉండటంవల్ల గుంట గలగరను పచ్చడి, పప్పు, వేపుడు, తాలింపుకూర మొదలైన వెరైటీలు తయారుచేసుకొని తింటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article