త్వరలో హీరో కంపెనీ మరో రెండు కొత్త వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో వీటిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటి ప్రత్యేతకలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. హీరో నుంచి విడుదల కానున్న జూమ్ 160 అనేది అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్. దీన్ని 2023లో జరిగిన ఈఐసీఎంఏ లో ప్రదర్శించారు. స్కూటర్ లోని కొన్ని డెవలప్ మెంట్లకు సంబంధించి ఆలస్యం జరగడంతో 2025కు విడుదలను వాయిదా వేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఎక్స్ పోలో తుది ఉత్పత్తిని ప్రదర్శిస్తారని సమాచారం.
పొడవైన విండ్ స్క్రీన్, ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ తదితర ప్రత్యేకతలతో కొత్త స్కూటర్ ఆకట్టుకుంటోంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ తో కూడిన ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. లాక్, అన్ లాక్ ఫంక్షన్లతో కూడిన కీలెస్ ఇగ్నిషన్, విశాలమైన అండర్ సీట్ స్టోరేజీ, ఫ్లోర్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఆకట్టుకుంటున్నాయి. జూమ్ 160 స్కూటర్ లో 156 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 13 బీహెచ్పీ, 13.7 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఐ3ఎస్ సైలెంట్ స్టార్ట్ టెక్, రెండు చివర్లలో డిస్కు బ్రేకులు అదనపు ప్రత్యేెకత.
హీరో కంపెనీ నుంచి విడుదలైన ఎక్స్ ట్రీమ్ 250 ఆర్ మోటారు సైకిల్ ను కూడా ఢిల్లీ ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఆధునాతన టెక్నాలజీ, సూపర్ డిజైన్ తో ఈ బైక్ ఆకట్టుకుంటోంది. 2024లో జరిగిన ఈఐసీఎంఏలో ఎక్స్ ట్రీమ్ 250 ఆర్ ను ప్రదర్శించారు. కొత్త మోటారు సైకిల్ లో 250 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 30 బీహెచ్పీ, 25 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. ఇంజిన్ కు 6 స్పీడ్ గేర్ బాక్స్ ను జత చేశారు. గోల్డెన్ అప్ సైడ్ డౌన్ ఫోర్కులతో పాటు వెనుక వైపు మోనోషాక్, 17 అంగుళాల అల్లాయ్ వీల్, బ్లూటూత్ కూడిన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్లు ఆకట్టుకుంటున్నాయి. హీరో కంపెనీకి చెందిన ఈ రెండు ద్విచక్ర వాహనాలను ఢిల్లీలో జరుగుతున్న ఎక్స్ పోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను అప్పుడే వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి