మీ-సేవకు వెళితే ఆధార్, పాన్, రేషన్ కార్డులు.. ఇలా ఏ గుర్తింపు కార్డుకు సంబంధించిన పని అయినా వెంటనే పూర్తవుతుంది. కొత్త గుర్తింపు కార్డుల నమోదు, పేరు మిగతా వివరాల్లో మార్పులు చేర్పులు ఇలా ఏ చిన్న పని ఉన్నా వెంటనే మీ-సేవకు పరుగులు పెట్టేస్తాం. ఆధార్, పాన్, రేషన్ కార్డులు అనేవి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. కానీ, ఈ అవసరమే కొన్నిసార్లు మనల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. హైదరాబాద్ నగరం పాతబస్తీలో మీ-సేవలకు జనం బారులు తీరారు. గుర్తింపు కార్డుల కోసం ప్రజలు క్యూకట్టారు. మరోవైపు, వాళ్ల అవసరాన్ని ఆసరా చేసుకుని వేలల్లో డబ్బులు దండుకుంటున్నారు నిర్వాహకులు.
పాతబస్తీ ప్రాంతంలో మీ-సేవలను వినియోగించుకోవడానికి వెళ్తున్నవారికి నిర్వాహకుల తీరు అగమ్యగోచరంగా మారింది. మీ-సేవ నిర్వాహకులు దరఖాస్తులను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం దాదాపు ఒక్కో దరఖాస్తుకి రూ.2 వేల వరకు దండుకుంటున్నారని మండిపడుతున్నారు. కనీస చార్జీలను మించి తమ అవసరాన్ని ఇలా వాడుకోవడం సరికాదని ఆందోళన చెందుతున్నారు. గుర్తింపు కార్డులు లేక చాలా పనులు ఆగిపోతున్నాయని, తీరా చేసుకుందామని వస్తే మీ-సేవ నిర్వాహకులు ఇలా పెత్తనం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు తెలిసీ తెలియక అడిగినంత వాళ్ల చేతిలో పెట్టి మోసపోతున్నారని అంటున్నారు.
దీంతో పాతబస్తీ వాసులు ఈ విషయాన్ని ఎంఐఎం నేతల దృష్టికి తీసుకెళ్లారు. నేతలకు సమస్యలను వివరించి ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కేలా చేయాలని, ఆర్థికంగా అంతంత మాత్రంగా తమ పరిస్థితిని అవకాశంగా మలుచుకుని మీ-సేవ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రజల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు చొరవ తీసుకుని మీ-సేవ సెంటర్ల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. దరఖాస్తులను బ్లాక్‌లో విక్రయిస్తే అనుమతులను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ప్రజల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం సరికాదని.. కనీస ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు కూడా ఎవరెవరి దగ్గర నుంచైతే అధికంగా వసూలు చేసి ఉన్నారో ఎంఐఎం నేతలు వివరాలు సేకరించి.. ఆ డబ్బులను బాధితులకు వెనక్కి ఇప్పించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి