కాంగ్రెస్ పార్టీ అంటేనే అపరిమిత స్వేఛ్చ, వర్గపోరు, కార్యకర్తల కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్. జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా విమర్శలు కూడా ఆపార్టీలో సహజం. సీనియర్లు మాటల వరకే ఉంటే జూనియర్లు ఏకంగా దాడులకు దిగుతుంటారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మావేశం జరుగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇరు వర్గాల యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్ములాటకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పదవుల విషయంలో గాంధీభవన్ ముందే యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ఇరువర్గాల కొట్లాటతో గాంధీభవన్ రణరంగంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్‌ను ఇటీవలే అధిష్టానం నియమించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కార్తీక్ ప్రధాన అనుచరుడు. అతనికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భట్టి వర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు.
కార్తీక్ ఏడాది క్రితం వరకూ బీఆర్‌ఎస్‌లో ఉన్నారనీ.. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ వయసు 37 సంవత్సరాలని యూత్ కాంగ్రెస్ పదవికి అనర్హులు అయినప్పటికీ పదవులు ఎలా కట్టబెట్టారని, తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల్లో గెలిచారంటూ అతనిపై పోటీ చేసిన సన్నీ ఆరోపించారు.
కార్తీక్ ఎన్నిక చెల్లదంటూ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్యతో పాటు రాష్ట్ర నాయకత్వానికి భట్టి అనుచరులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక చెల్లదంటూ జిల్లా అధ్యక్షులు లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ తీసుకుని రాష్ట్ర నాయకత్వం దగ్గర తేల్చుకునేందుకు భట్టి వర్గం వచ్చింది. మరోవైపు కార్తీక్ వర్గం కూడా అదే సమయంలో గాంధీభవన్‌కు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అయితే ఇది పెద్ద గొడవేమీ కాదనీ.. శాంతియుతంగా పరిష్కరించుకుంటామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్‌రెడ్డి అన్నారు.
అంతర్గత తనిఖీల తర్వాతే యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పూర్తి చేశామని ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటామని తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సురభి ద్వివేది తెలిపారు. తాజా గొడవతో ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న గాంధీభవన్ అంటే గొడవలకు కేరాఫ్ అడ్రస్ అనే నానుడిని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి నిజం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి