బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, రామ్‌నాస్త్‌పురా కార్పొరేటర్ మహ్మద్ ఖాదర్‌తో కలిసి మెమన్ అపార్ట్‌మెంట్ సమీపంలోని BNK కాలనీని ఆకస్మికంగా సందర్శించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత లోపం, త్వరితగతిన పనుల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు.
ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ పాతబస్తీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు, కాలనీల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా అభివృద్ధి పనులకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ తనిఖీలు నిర్వహించగా.. ఆ తనిఖీల్లో సీసీ రోడ్డు బెడ్ సైడ్ బంప్ సరైన కొలతలు లేకుండా పనులు జరుగుతుండడాన్ని గమనించారు. నిర్మాణ పనుల్లో అవకతవకలను గమనించిన ఎమ్మెల్యే.. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులను పిలిపించి కొనసాగుతున్న పనులను నిలుపుదల చేయాలని ఆదేశించారు. నిర్వాసితులకు అసౌకర్యం కలగకుండా సరైన ప్రమాణాలు, కొలతలతో పనులు మళ్లీ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీసీ రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ వచ్చి బెడ్ సైడ్ బంప్ సరిగా వేయలేడమో స్వయంగా చేతితో పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. పనుల్లో నాణ్యత కొరవడిందని.. కంకర, సిమెంట్ అవసరమైన పాళ్లలో వేయకుండా తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా మళ్లీ కొద్ది రోజుల్లోనే రోడ్డు ఛిద్రమై స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. దీంతో పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. సరైన నియమ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని, ఎప్పుడూ అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించరాదని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం ఏఐఎంఐఎం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు సరైన నాణ్యత మరియు ఖచ్చితత్వంతో జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి