గుంటూరు, నవంబర్ 7: వ్యవసాయ పంటలపై కొత్త కొత్త వైరస్‌లు, తెగుళ్లు దాడి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏ పురుగు మందులు ఉపయోగించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లాలో నల్ల తామర పురుగు మిర్చి పంటను తుడిచిపెట్టేసింది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఎన్ని పురుగు మందులు వాడిన నల్ల తామర ఉద్రుతిని తగ్గించలేకపోయారు. ఈ క్రమంలోనే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి… జాతీయ సమీక్రుత తెగుళ్ల నిర్వహణ కేంద్రాలతో కలిసి ఒక ప్రత్యేకమైన యాప్ ను తయారు చేసింది. ఈ యాప్ మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని రైతులు తమ పంటలకు వ్యాపించిన వైరస్, తెగుళ్ల ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలి. అప్ లోడ్ చేసిన తర్వాత ఏ వైరస్ వచ్చింది? దాని నివారణ కోసం ఎటువంటి మందులు పిచికారి చేయాలన్న అంశాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంటనే సూచిస్తారు. దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీంతో పాటు పెస్ట్ సర్వ్ లెన్స్ మాడ్యూల్ కింద ప్రతి జిల్లాలో సెల్ ఫోన్ వినియోగించే పది మంది రైతులను ఎంపిక చేసి వారికి యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఇస్తారు. ఆ రైతులు సమస్యలను నేరుగా వ్యవసాయాధికారులు ద్రుష్టికి తీసుకురావచ్చు. తద్వారా అన్నదాతలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. వీటిని ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించే అవకాశం కూడా ఉంటుంది. ఏపిలో పదిహేను పంటలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు ఏఐ ఆధారిత యాప్ ఉపయోగపడుతుందని వ్యవసాయాధికారులు అంటున్నారు.
ఈమధ్య కాలంలో పంటలపై వైరస్ ల దాడి పెరిగిందని ఇటువంటి సమయంలో వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే పంటలు కాపాడుకోవడం సాధ్యం కాదంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు సులభంగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ తో కూడా యాప్ అభివ్రుద్ది చేశామన్నారు. తెగుళ్లు తట్టుకునే వంగడాలను అభివ్రుద్ది చేసుకునేందుకు ఈ విధానం ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరిగిపోతుండటంతో డ్రోన్లు ఉపయోగించి మందులు పిచికారి చేయడం వంటి వాటిని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. వీటితో పాటు అధునాతన సాంకేతికత ఉపయోగించి రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి