ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెల రోజులుగా సంచరిస్తున్న వింత జంతువును స్థానికులు పట్టుకున్నారు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇళ్లలో తచ్చాడుతున్న వింత జంతువును వల సాయంతో బంధించిన స్థానికులు అటవిశాఖ అదికారులు అప్పగించారు. ఓ ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్‌లో జంతువు సంచారాన్ని గమనించిన పలువురు.. ఆ జంతువు మర్నాగి అని కొందరు.. అడవి ముంగిస అని మరికొందరు చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరా అటవిశాఖ అదికారులు ఆ జంతువును పునుగు పిల్లిగా నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల తిరుపతి అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ఇంద్రవెల్లిలో ప్రత్యక్షమవడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలంలో ఆదివారం అర్థ రాత్రి 9 గంటల ప్రాంతంలో రాంనగర్ కాలనీలోని ముండే లక్ష్మణ్ అనే వ్యక్తి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు కనిపించింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయగా.. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బందితో కలిసి వలవేసి ఈ జంతువును బందించారు. స్థానిక యువకులు ఆ జంతువును చాకచక్యంగా పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం. చంద్రారెడ్డి, అటవీశాఖ సిబ్బంది సంజివ్‌లు ఆ జంతువును స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు బావిస్తున్నట్టుగా ఈ జంతువు వింత జీవి కాదని.. అత్యంత అరుదైన పునుగు పిల్లి అని తేల్చారు. పునుగు పిల్లిని వాహనంలో చీచ్ ధరి ఖానాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన అధికారులు.. దట్టమైన అటవిప్రాంతంలో వదిలేశారు.
అటవి శాఖ సిబ్బందికి సహకరించి.. వన్య ప్రాణుల సంరక్షణకు తోడ్పడిన యువకులను అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. వన్య ప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ఏదైనా జంతువు సంచారం గురించి తెలిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..