ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో మెరిసిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాబోయే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టుకు ఎంపిక కాలేదు. 779 పరుగులతో రికార్డు సృష్టించినప్పటికీ, సెలెక్టర్లు అతనికి అవకాశం ఇవ్వలేదు. అయితే, నాయర్ దీనిని స్వీకరించినప్పటికీ, తన టెస్ట్ కెరీర్‌ను పునరుద్ధరించాలనే కలను మాత్రం వదులుకోలేదని స్పష్టం చేశాడు.
“నిజాయితీగా చెప్పాలంటే, టోర్నమెంట్‌కు ముందు నేను ఛాంపియన్స్ ట్రోఫీ ఎంపిక గురించి ఆలోచించలేదు. కానీ మీరు కలలు కనాలి, మీరు సాధించాలనుకుంటారు. అయితే అది నిజంగా జరుగుతుందా? అనే సందేహం మిగిలే ఉంటుంది,” అని స్పోర్ట్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ అన్నాడు.
“భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనే కల నాకు ఇప్పటికీ ఉంది. ఇది నేను అనేక ఇంటర్వ్యూలలో చెప్పాను. నా దృష్టి ఇదే. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో నాకు అవకాశం రాదని నేను ముందే అర్థం చేసుకున్నాను. కానీ భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రావాలనుకుంటున్నాను,” అని నాయర్ స్పష్టం చేశాడు.
ఈ సీజన్‌లో కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీలో 779 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ సగటు 389.50, ఏకంగా 5 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు చేశాడు. కానీ ఈ అద్భుత ప్రదర్శన కూడా అతనికి భారత జట్టులో చోటు దక్కేలా చేయలేదు.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, భారత జట్టు ఎంపిక సందర్భంగా నాయర్ పేరు మిక్స్‌లో ఉన్నప్పటికీ, అతనికి అవకాశాన్ని ఇవ్వలేదని తెలిపారు.
సచిన్ టెండూల్కర్ ప్రశంసలు :
నాయర్ ఈ సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దృష్టిని ఆకర్షించాడు. అతని నిబద్ధత, పట్టుదల గురించి సచిన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దీనిపై స్పందించిన నాయర్, “నా చిన్ననాటి హీరో నుంచి ప్రశంసలు అందుకోవడం గొప్ప అనుభూతి. సచిన్ నా ఆట గురించి చెప్పిన మాటలు నాకు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. కానీ నేను ఇప్పటికీ నా ఆటపై దృష్టి పెడతాను, ప్రతి ఇన్నింగ్స్‌ను మెరుగుపరచడం నా లక్ష్యం” అని చెప్పాడు.
కరుణ్ నాయర్ 2017లో చివరిసారిగా భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆరు టెస్టులకే పరిమితమైన అతను 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు, ఇందులో 303 నాటౌట్ (త్రిపుల్ సెంచరీ) కూడా ఉంది. ఇప్పుడతను ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడు.
ఒకప్పుడు త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఇప్పుడు జాతీయ జట్టులో చోటు కోసం కష్టపడుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తిరిగి కనిపించాలనే అతని ఆశ నెరవేరుతుందా? వేచి చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..