ప్రస్తుతం నడుం నొప్పితో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, వ్యాయామం తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా నడుం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో నడుం నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని రకాల సహజ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే నడుం నొప్పిని తగ్గించే ఆ నేచురల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నడుం నొప్పిని తగ్గించేందుకు ఐస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్‌ను 20 నుంచి 25 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఒక గుడ్డలో ఐస్ ప్యాక్స్ వేసుకొని రుద్దినా ఫలితం ఉంటుంది. అలాగే వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాడ్‌ను ఉపయోగించినా నొప్పి తగ్గుతుంది. బిగుసుకు పోయిన నరాలు సడలి నొప్పి తగ్గుతుంది.
తులసి, అల్లం కూడా వెన్న నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక అల్లం ముక్కను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం అల్లం నీటిలో తులసి ముక్కలను తేసుకొని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఒళ్లు నొప్పులన్నీ దూరమవుతాయి. పసుపు కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం వాపును, నొప్పిని దూరం చేస్తుంది.
ఇక ఉప్పు, ఆవాలతో మసాజ్ చేసుకున్న వెన్ను నొప్పి తగ్గుతుంది. ఆవాలన నూనెలో కొంచెం ఉప్పు వేసి వేడి చేయాలి. అనంతరం ఆ ఆయిల్‌ను నొప్పి ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది. వీటన్నింటితో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. నడుం నొప్పికి సంబంధించిన యోగాసనాలు వేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..