సమ్మక్క సారక్క జాతర.. రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ… కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క, సారక్క మినీ మేడారం జాతర నిర్వహించడానికి ఆదివాసి పూజారులు ముహూర్తం ఫిక్స్ చేశారు.. అయితే ఈ జాతర నిర్వహణకు వారం రోజుల ముందు ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు.. ఆలయాలు శుద్ధిచేసి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహించడం ఒక సాంప్రదాయ వేడుక..
మినీ జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్మించిన ఈ పూజ కార్యక్రమాల సందర్భంగా ఆదివాసీ పూజారులు మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజ నిర్వహించారు.. ఆలయం శుద్ధి చేసిన అనంతరం ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో, కొండాయిలోని గోవిందరాజు, ఆలయంలో పూనుగొండ్లని పగిడిద్దరాజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు గుడిమెలికి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహించారు.. మరో వైపు నాయకపోడు పూజారులు ఘట్టమగుట్ట వద్ద ఎదురుపిల్ల వేడుక నిర్వహించారు.. అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలకు అంకురార్పణ చేశారు..
కాగా.. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో జరిగే మినీ మేడారం జాతర కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. దీంతోపాటు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను కూడా మోహరించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..