News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ

5 hours ago 1

దేశంలోనే నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరుగుతోంది. జర్మనీలోని చారిత్రాత్మక ఫుట్‌బాల్ గ్రౌండ్ MHP ఎరీనాలో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో నేడు రెండో రోజు. రెండో రోజు ‘ఇండియా: ఇన్‌సైడ్‌ ది గ్లోబల్‌ బ్రైట్‌స్పాట్‌’ అనే అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

భారత్‌-జర్మన్ భాగస్వామ్యంపై చారిత్రాత్మక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ, భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత్‌-జర్మన్ భాగస్వామ్యానికి కొత్త శకానికి నాంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశానికి చెందిన టీవీ9 జర్మనీలో ఈ సదస్సును నిర్వహించింది. నేటి సమాచార యుగంలో జర్మన్ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి భారతీయ మీడియా గ్రూప్ ప్రయత్నిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్‌-జర్మన్ భాగస్వామ్యం ఔచిత్యాన్ని, దాని విస్తృత సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారంతో రెండు దేశాలు కొత్త శిఖరాలను తాకుతున్నాయని ప్రధాని మోదీ అభివర్ణించారు.

భారత్‌-జర్మనీ స్నేహ బంధం

భారత్‌-జర్మన్ భాగస్వామ్యాన్ని రెండు దేశాల మధ్య బాధ్యతాయుతమైన, దీర్ఘకాలిక స్నేహా బంధానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయని, ఇది ఈ బంధంలోని చారిత్రాత్మక, స్థిరమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఐరోపాలో తెలుగు, తమిళం వంటి భారతీయ భాషల్లో పుస్తకాలను ప్రచురించిన తొలి దేశం జర్మనీ అని ఆయన గుర్తు చేశారు. మన సాంస్కృతిక బంధాలు శతాబ్దాల నాటివి. యూరప్ మొట్టమొదటి సంస్కృత వ్యాకరణాన్ని జర్మన్ పండితుడు రచించారని మోదీ పేర్కొన్నారు.

వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌

జర్మనీని భారతదేశానికి విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించిన ప్రధాని, ప్రస్తుతం జర్మనీ భారతదేశంలో 1,800కి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో సుమారు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 50,000 మంది విద్యార్థులు జర్మన్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్‌ను వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా చూస్తోందని జర్మనీ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పత్రం రుజువు చేసిందని ఆయన అన్నారు.

ఆర్థిక సంస్కరణలు-ఫలితాలు

గ‌త 10 సంవ‌త్సరాల‌లో భార‌త‌దేశంలో జ‌రిగిన సంస్కర‌ణ‌ల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. ‘రిఫార్మ్, పెర్ఫార్మ్, అండ్ ట్రాన్స్‌ఫార్మ్’ అనే మంత్రంతో ప్రతి రంగంలోనూ విధానపరమైన సంస్కరణలు చేపట్టామని, జీఎస్‌టీ ద్వారా 30,000కుపైగా కంప్లైంట్‌లను తొలగించామని, పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం తన బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసిందని, వ్యాపారం కోసం ప్రగతిశీల, స్థిరమైన విధాన రూపకల్పన వాతావరణాన్ని సృష్టించిందని ఆయన అన్నారు. ఈ సంస్కరణలు భారతదేశాన్ని ‘అభివృద్ధి చెందిన దేశం’గా మార్చేందుకు బలమైన పునాదిని అందజేస్తున్నాయని వివరించారు.

విస్తరిస్తున్న ఆటోమొబైల్‌ రంగం

భారత తయారీ రంగంలో సాధించిన విజయాలపై ప్రధాని మోదీ చర్చించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారుగా నిలిచిందన్నారు. రెండవ అతిపెద్ద స్టీల్‌, సిమెంట్ తయారీదారుగా, నాల్గవ అతిపెద్ద ఫోర్-వీలర్ తయారీదారు అని ఆయన తెలియజేశారు. భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ కూడా త్వరలో ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేయనుందని ఆయన తెలిపారు.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెరగుదల

భార‌త‌దేశంలో భౌతిక, సామాజిక, డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల‌లో త్వర‌గా పెట్టుబ‌డులు జ‌రుగుతున్నాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం సాధించిన విజయాలను వివరిస్తూ, ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగి ఉన్న దేశంగా అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రయత్నాల వల్లే భారతదేశం నేడు పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు.

పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ కంపెనీలకు ఆహ్వానం

భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జర్మనీ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇంకా భారత్‌కు రాని జర్మనీ కంపెనీలను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశ విధానాలు, వ్యాపార వాతావరణం, స్థిరత్వాన్ని ప్రధాని ప్రస్తావించారు.

తయారీ – సాంకేతికతలో సహకారం

మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ రంగాలలో జర్మనీ – భారతదేశం మధ్య బలమైన సహకారానికి అవకాశం ఉందని ప్రధాని అన్నారు. ప్రపంచానికి సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో జర్మనీకి సహకరించాలని ఆయన అన్నారు.

ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ పాత్ర

భారతదేశం గ్లోబల్ పాత్రను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం ‘వ్యూహాత్మక ప్రాముఖ్యత’, ‘సాంకేతిక సామర్థ్యాన్ని’ గుర్తిస్తోందని ఆయన అన్నారు. భారతదేశంలో కొనసాగుతున్న సంస్కరణలు, స్థిరమైన విధానాల ఫలితంగా ఇది జరిగిందని ఆయన వివరించారు.

సాంస్కృతిక సమన్వయ సందేశం

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపులో భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని, ‘వసుధైవ కుటుంబం’ స్ఫూర్తిని గుర్తు చేశారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలను భారతదేశం ఎల్లప్పుడూ స్వాగతించింది. వారిని మన దేశంలో భాగం చేస్తుంది. ప్రపంచానికి సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్నారు.

ప్రధాని మోదీ ఈ ప్రసంగం భారత్‌-జర్మనీల మధ్య పెరుగుతున్న సహకారాన్ని, ప్రపంచంలో భారత్‌ పాత్రను స్పష్టం చేసింది. భారతదేశంలో జరుగుతున్న మార్పులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, భారతదేశంలో తమ భాగస్వామ్యాన్ని పెంచడానికి జర్మన్ కంపెనీలను ప్రేరేపించారు. ఈ ప్రసంగం రెండు దేశాల మధ్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

వీడియో చూడండి.. 

Addressing the News9 Global Summit. @News9Tweetshttps://t.co/bOCjBBMFPc

— Narendra Modi (@narendramodi) November 22, 2024

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article