పిల్లలకి మంచి చేయాలనే ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన మాటలు వాళ్ళకి మేలు చేయకపోగా హాని చేస్తాయి. మనం రోజు వాడే మాటల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? పిల్లలతో అనకూడని కొన్ని మాటలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నిసార్లు చెప్పాలి..?
ఈ మాట తరచుగా పిల్లలకు నిరాశను కలిగిస్తుంది. పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనికి బదులు “నేను ఇదివరకే చెప్పాను కదా. ఒకసారి గుర్తు చేసుకుంటావా..?” అని మీరు మాట్లాడండి. ఇలా మాట్లాడితే వాళ్ళు మీకు సహకరిస్తారు.
పర్వాలేదు, ఏం కాలేదు
పిల్లవాడు బాధపడుతుంటే “ఏం పర్వాలేదు” అనడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం గుర్తించనట్టు అవుతుంది. బదులుగా వాళ్ళ బాధని అర్థం చేసుకోని “భయంకరంగా పడ్డావు నాన్న, బాధగా ఉందా..? అని ఎత్తుకొని బుజ్జగించండి.
నేను చెప్పాను కాబట్టి
ఈ మాట పిల్లలకి చిరాకు తెప్పిస్తుంది. వాళ్ళకి విషయం అర్థం కాదు. బదులుగా “ఇదిగో ఇలా చేస్తే నీకు ప్రమాదం ఉండదు” అని కారణం చెప్పండి. ఇది వాళ్ళకి రూల్స్ ఎందుకు పాటించాలో అర్థం చేసుకోవడానికి అదే విధంగా గౌరవం పెంచడానికి సహాయపడుతుంది.
మన దగ్గర డబ్బులు లేవు
“మన దగ్గర డబ్బులు లేవు” అని చెప్పడం వల్ల పిల్లలు భయపడతారు. బదులుగా “ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు. ఇంకొంచెం దాచుకుంటే కొనుక్కోవచ్చు” అని చెప్పండి. ఇది డబ్బు గురించి, పొదుపు గురించి మాట్లాడటానికి అవకాశం ఇస్తుంది.
సిగ్గుపడాలి
పిల్లల్ని సిగ్గుపడమని చెప్పడం వల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. బదులుగా వాళ్ళకి ఏం జరిగిందో అర్థం చేసుకోమని చెప్పి, మంచిగా ఎలా ప్రవర్తించాలో నేర్పించండి. “నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు.. కానీ ఏం జరిగిందో చెప్పు” అని ఈ విధంగా మాట్లాడండి.
నాతో మాట్లాడకు
కోపం వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడొద్దని చెప్పడం వల్ల వాళ్ళు భయపడతారు. మనకి దూరమవుతారు. బదులుగా “నేను కాసేపు ఆలోచించుకుంటాను.. తర్వాత మాట్లాడుదాం” అని ప్రశాంతంగా చెప్పండి.
ఇది తింటేనే చాక్లెట్ ఇస్తా
ఇలా స్వీట్లు, చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడం వల్ల వాళ్ళకి అనారోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. బదులుగా “ముందు భోజనం చేద్దాం.. తర్వాత స్వీట్ తిందాం” అని చెప్పండి. ఇది వాళ్ళకి ఆహారంపై మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది.
అపరిచితులతో మాట్లాడకు
భద్రత ముఖ్యం.. కానీ అపరిచితులతో మాట్లాడకూడదని చెప్పడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. బదులుగా వేరే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో చెప్పండి. ఎవరైనా తెలియని వ్యక్తి మాట్లాడితే ఏం చేయాలో వాళ్ళని అడగండి.. వారి ఆలోచన విధానం సరిగా లేకపోతే పిల్లలకు అర్ధమయ్యేలా సరైనది చెప్పండి.
నాన్న వస్తే చెప్తా
ఇలా అనడం వల్ల పిల్లలు భయపడతారు. బదులుగా “నాన్నకి ఏం జరిగిందో చెప్తావా.. లేక నేను చెప్పనా?” అని అడగండి. ఇది వాళ్ళకి ధైర్యాన్నిస్తుంది. మంచి సంభాషణకి దారి తీస్తుంది.
అమ్మాయిలు, అబ్బాయిలు అలా చేయరు
ఇలా లింగభేదం చూపించడం వల్ల పిల్లలు వాళ్ళకి నచ్చినవి చేయలేరు. వాళ్ళకి నచ్చినవి చేయడానికి ప్రోత్సహించండి. “నీకు ఏం కావాలో అది చేయొచ్చు. మీకు ఇద్దరికీ నచ్చినవి కలిసి చేయండి” అని చెప్పండి.