ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను కైవసం చేసుకున్నాయి.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీతో పాటు ఎన్డీయే శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలపడంతోపాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోమారు రుజువైందంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ప్రకటన..
‘‘2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికీ, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోదీ పై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారు.’’ అంటూ పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జె.పి.నడ్డా, బీజేపీ, మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..