పోలవరం.. దశాబ్దాల ఆంధ్రుల కల. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయ్. ప్రభుత్వాలు మారుతున్నాయ్. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో కీలక ముందడుగు వేసింది చంద్రబాబు సర్కార్. పోలవరం తమకు అత్యంత ప్రాధాన్యత. జనవరి నుంచి పనులు మొదలు పెడతాం. ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తామని మొదటి నుంచీ చెప్తూ వచ్చిన చంద్రబాబు.. చెప్పినట్టుగానే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2020 వరదల్లో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. ప్రాజెక్ట్‌ను రీ స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. దీనికి సంబంధించిన భూమిపూజ, హోమాన్ని కూడా నిర్వహించారు.
ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్
వాస్తవానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసింది. అయితే 2020లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతిన్నది. ఇసుక కోతకు గురై అగాథాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి, వైబ్రో కాంపక్షన్ విధానంలో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. దీని కోసం 383 ప్యానెల్స్‌తో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగనుంది. ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిశాండింగ్ యంత్రాలు కూడా వచ్చాయి.
కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు
కొత్త డయాఫ్రం వాల్ కోసం 990 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 1396 మీటర్ల పొడవు.. ఒకటిన్నర మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనిష్టంగా 20 మీటర్లు.. గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు. పాత డయాఫ్రమ్ వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టింది కూటమి ప్రభుత్వం. డయాఫ్రం వాల్ సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దాని పైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది.
కేంద్రం సాకారంతో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. రెండేళ్లలోనే పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. బనకచర్లకు పోలవరాన్ని అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇబ్బందే ఉండదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి పాదాల చెంతకు గోదావరి నీళ్లను తరలించి రాయలసీమ రుణం తీర్చుకోవడమే తన జీవిత ఆశయం అంటున్నారు సీఎం చంద్రబాబు.
నదుల అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టే అత్యంత కీలకం. ఈ పోలవరం పూర్తి కావాలంటే డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా పూర్తి కావాలి. అందుకే అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది చంద్రబాబు సర్కార్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..