పోలీసులు ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా.. గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రైల్, రోడ్డు, కారు, బైక్ ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిఘా కళ్ళుగప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కేటుగాళ్ల స్కెచ్‌లకు ధీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. తాజాగా పుష్ప సినీ స్టైల్‌ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.
కారు బంపర్‌లో ప్రత్యేక అరలు ఏర్పాటు..
గంజాయి రవాణాకు కేటుగాళ్ళు ప్రత్యేక పంథాను ఎంచుకున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ అడుగు భాగంలో ప్రత్యేక అర ఏర్పాటు చేసినట్లు తాజా కేసులో కేటుగాళ్ళు కారు డిక్కీ అడుగు భాగం వెనుక బంపర్ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో జాలితో అరలు ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. ఎక్కడైనా పోలీస్ చెకింగ్ చేసినా వెనుక డిక్కీ తెరిచి చూస్తే ఏమీ కనపడదు.. అలా పోలీసులను ఏమార్చి గంజాయి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
110 కేజీల గంజాయి స్వాధీనం..
సూర్యాపేటలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. తనిఖీ చేస్తుండగా కార్లలోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కారులో గంజాయి వాసన గమనించారు కానీ పోలీసులకు ఎక్కడా గంజాయి కనపడలేదు. మొదట నిందితులు గంజాయి సేవించారనుకుని భ్రమ పడిన పోలీసులు.. వదలకుండా గంజాయి వాసనపై లోతుగా తనిఖీ చేశారు. కారు వెనుక డిక్కీ కింద బంపర్ లోపలి, మధ్య భాగంలో ప్రత్యేక అరలు, సంచులు ఏర్పాటు చేశారు. ఒరిస్సా నుండి కర్ణాటక, మహారాష్ట్రాలకు కార్ల వెనుక డిక్కీ కింద బంపర్‌కు లోపలి, మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు, సంచుల ద్వారా గంజాయి తరలిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాల గుట్టుని సూర్యాపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 27.40 లక్షల విలువగల 110 కేజీల గంజాయి, మూడు కార్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు పుష్ప సినిమాను చూసి ప్రేరణతో ఈ స్కెచ్ వేశారని పోలీసులు చెబుతున్నారు.