ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో దానికంటే ముందే ముహూర్తం ఫిక్స్ కానుంది. ఆ తర్వతా అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు, కుల గణన సర్వే, మరియు ఆర్ ఓ ఆర్ చట్టంపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక అంశాలను ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పదవీకాలంలో ఏడాది పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుందని తెలుస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం, విస్తరణను మరింత కీలకంగా మారుస్తోంది.
ఈ మంత్రివర్గ విస్తరణలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బెర్త్ కచ్చితంగా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. విస్తరణలో తోడుగా కొన్ని శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్; నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు; మహబూబ్ నగర్ మక్తల్ నుండి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో బాలునాయక్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావహులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆసరా పెన్షన్, రైతు భరోసా వంటి పథకాల అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పథకాలు ప్రజల్లో ప్రభుత్వం పై నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడతాయని భావిస్తోంది. ఇదిలా ఉంటే కొండపోచమ్మ సాగర్ సమీపంలోని హరీష్ రావు ఫాం హౌస్ పై విచారణను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ చర్యతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇవన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి . డిసెంబర్ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణపై అందరి పోకస్ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..