దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. యూనిలీవర్ కంపెనీతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార అవకాశాలపై సీఎం రేవంత్ బృందం జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరించింది. త్వరలో కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది.
Chief Minister Revanth Reddy, Minister D. Sridhar Babu astatine t World Economic Forum
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో తొలి ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపారానికి ఉన్న అవకాశాలపై వారికి వివరించారు. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ బృందం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని తెలంగాణ ప్రతినిధుల బృందం తెలిపింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని వెల్లడించింది.
తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.