వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. కొద్దిరోజుల క్రితం వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో అపశృతి చోటుచేసుకోవడంతో రథసప్తమికి టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే.. రథసప్తమి ఏర్పాట్ల పై మాడవీధుల్లో జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, భద్రత ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతపరంగా కలెక్టర్, ఎస్పీలతో చర్చించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక.. రథసప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబడవని.. కేవలం సర్శదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు.
తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకకు గతంలో కంటే పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్థన్‌రాజు. గతంలో ఎక్కడెక్కడ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భక్తులకు టీటీడీ సూచనలు
- రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
- అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
- ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.
- తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి.
వాహన సేవల వివరాలు….
ఉ. 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
ఉ. 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి