అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు సిట్ సిద్ధమైంది. సిట్ ఎంక్వయిరీకి సహకరించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది. NDDB కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టిటిడి వాదన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఇలా ఎట్టకేలకు సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది.
శ్రీహరి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఉండే అధికారులపై ఇప్పటికే స్పష్టత కూడా వచ్చింది. 5 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సీబీఐ తరఫున పాల్గొనే విచారణ అధికారుల పేర్లను ఆ దర్యాప్తు సంస్థ కూడా ఇప్పటికే ప్రకటించింది.
సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్ సత్యేన్ కుమార్ పాండాలను నియమించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ పని చేయనుండగా ఇప్పటికే ఏపీ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసి కొంతమేర విచారించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సిట్ ఏర్పాటు చేయడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అధికారుల బృందంతో కొంత దర్యాప్తు కూడా పూర్తి చేయించింది. విచారణ అధికారుల బృందం 3 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో కూడా పర్యటించింది. కల్తీ నెయ్యి సరఫరాపై కేసు పెట్టిన ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ నుంచి వాంగ్మూలం తీసుకోవడంతో పాటు పిండిమర, ల్యాబ్ లను పరిశీలించి ప్రాథమిక నివేదిక రూపొందించింది.
ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సీబీఐ సిట్ బృందం టిటిడిలో సరకుల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, ల్యాబ్ లలో పరీక్షల తీరుపై వివరాలు సేకరించింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ మరో సంస్థ నుంచి సరకు సేకరించడం, ఆ సంస్థ మరో కంపెనీ నుంచి కొనుగోలు చేసిందన్న కొంత సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర పరిశీలన చేసి, నివేదిక ఇవ్వబోతుండగా సిట్ ఎంక్వయిరీ కి అవసరమైన ప్రత్యేక కార్యాలయం, కావాల్సిన వసతులపై సీబీఐ టీటీడీకి లేఖ కూడా రాసింది.
క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిద్ధమైన సిట్ టీం సహాయ సహకారాలు అందించేందుకుగాను 30 మంది అధికారులను తీసుకోనుంది. డీఎస్పీ స్థాయి నుంచి మినిస్టీరియల్ సిబ్బంది వరకు అవసరం ఉంటుందని భావించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిన దర్యాప్తు బృందం అధికారులను కూడా ఎంపిక చేసుకోనుంది. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తును తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఈ మేరకు అవసరమైన అతిథిగృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీని కోరిన సీబీఐ అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో కార్యకలాపాలు సాగించేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు ఎన్డీడీబీ కాఫ్ నివేదిక లో పొందుపర్చిన అంశాలు, కల్తీ నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వుతోపాటు చేప నూనె ఉన్నట్లుగా పరీక్ష నివేదికలో పొందుపరచిన ఆధారాలను పరిగణలోకి తీసుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా పరిగణిస్తోంది.
ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ అక్రమాలను నిగ్గుతే ల్చేందుకు సిట్ సభ్యులతోపాటు మొత్తం నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, ఇద్దరు ఎస్సైల సేవలను వీరు వినియోగించు కోవాలని భావిస్తోంది. మరికొందరు మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించనుండగా సిట్ టీం వసతి కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీబీఐ కూడా అధికారులు కోరింది.
కంప్యూటర్లతోపాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపర్చుకునేందుకు అవసరమైన ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిం చుకునేందుకు అనువైన రీతిలో బిల్డింగ్ కేటాయించాలని కేటాయించాలని కోరింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్యాలయాన్ని ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్న ఎంక్వయిరీ టీం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి గుట్టు తేల్చేలా దర్యాప్తు ను వేగవంతం చేయబోతోంది. అయితే ఇప్పటికీ కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కల్తీ నెయ్యి వ్యవహారం దెబ్బతీసిందని ఇక ఎలాంటి విచారణ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..