అమెరికా అధ్యక్షడు ట్రంప్ అక్రమవలదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పేపర్స్ లేకుండా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు.. అయితే దీనిపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా డీపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ.. ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అదీ వారి కాళ్లు, చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడ్డాయి. రెండురోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డీపోర్ట్ చేయబోతే.. ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని ఎయిర్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన నాలుగు విమానాల్లో పంపించింది. తాజాగా కొలంబియా దేశం కూడా.. తమ దేశానికి అమెరికా పంపిన రెండు సైనిక విమానాలను తిప్పి పంపేసింది. అటు బ్రెజిల్ విదేశాంగ శాఖ కూడా.. వలసదారుల చేతులు, కాళ్లకు గొలుసులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా చరిత్రలోనే ఇలా మాస్ డీపోర్టేషన్‌కు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను వాడడం కూడా చర్చనీయాంశమైంది.
ఇటు.. ట్రంప్ చూపు గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకే ఆగిపోలేదు. అంతకు ఒక అడుగు ముందుకేసి గ్రీన్‌లాండ్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఐతే.. ట్రంప్ ప్రయత్నాన్ని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ తిరస్కరించారు. దీనిపై ఇద్దరు నేతల మధ్య ఘాటైన సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో డెన్మార్క్ ప్రధానిని ట్రంప్ బెదిరించినట్లు అమెరికన్ మీడియా చెప్తోంది.
భారతీయులకు టెన్షన్ టెన్షన్..
దీంతో.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. డిపోర్టేషన్ భయాలతో అక్కడ చేస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ.. ఉద్యోగం కన్నా.. చదువు ముఖ్యం అనుకుంటున్న వారు ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ.. ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్ చేస్తున్న అమెరికా.. ముఖ్యంగా మెక్సికన్లు, భారతీయులను టార్గెట్ చేసింది. దీంతో మనోళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వీడుతున్నారు..
వాస్తవానికి పార్ట్‌టైమ్ జాబ్స్‌తో పాకెట్ మనీని సంపాదించుకుంటున్నారు మన యువత. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, గ్రోసరీ స్టోర్స్‌లో పనిచేస్తూ టిప్స్ మీద బతుకుతున్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు భారం కావొద్దన్నది అసలు కారణం. కాని ట్రంప్ ఆ ఇలాంటి వారినీ వదలడంలేదు. అధికారులకు ఏమాత్రం అనుమానం వచ్చినా.. రూల్స్‌ని అతిక్రమించే వారిని వెనక్కిపంపాలని చూస్తున్నారు. అసలే లక్షలాది రూపాయలు బ్యాంక్‌లోన్లు తీసుకుని అమెరికా వస్తే.. చదువు పూర్తి కాకుండానే డిపోర్ట్ అయితే ఆర్థిక కష్టాలు వెంటాడతాయన్న భయంలో ఉన్నారు. కొన్నిరోజులు కష్టపడితే డిగ్రీ పట్టాతో ఇండియా వెళ్లి మంచి జాబ్‌లో చేరొచ్చన్న ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..