అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మూడు రోజుల వ్యవధిలోనే ఆ దేశ అధికార యంత్రాంగం అక్రమ వలసదారులపై యాక్షన్ మొదలుపెట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మంది అక్రమ వలసదారులను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అత్యధికులు ఉగ్రవాద అనుమానితులు, డ్రగ్స్ రవాణా, మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులైన అక్రమ వలసదారులు ఉన్నారు. అలాగే వందలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించారు. సైనిక విమానాల్లో వారిని దేశం నుంచి బయటకు పంపించివేశారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ చర్యల ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ట్రంప్ నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
అక్రమ వలసదారుల అరెస్ట్‌పై వైట్‌హౌస్ ప్రకటన
🚨DAILY IMMIGRATION ENFORCEMENT REPORTING FROM ICE🚨
538 Total Arrests
373 Detainers Lodged
Examples of the criminals arrested beneath 🔽🔽🔽
— The White House (@WhiteHouse) January 24, 2025
అక్రమ వలసదారుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్.. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే ఉత్తర్వులపై సంతకం చేశారు. మరీ ముఖ్యంగా అక్రమ వలసలు ఎక్కువగా సాగుతున్న అమెరికా – మెక్సికో బార్డర్‌లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్రమ వలసదారులు లక్షలాది మంది గత నాలుగేళ్లలో దేశంలోకి వచ్చి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆ ఆర్డర్‌లో ట్రంప్ పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజలకు ముప్పుగా మారుతున్నందునే వీరిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అమెరికాలో అత్యధికంగా మెక్సికో, కెనడా తదితర దేశాలకు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దేశ సరిహద్దులో మెక్సికో శరణార్థుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. దేశ దక్షిణ సరిహద్దు వెంబడి అక్రమ వలసదారుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు 1500 మంది భద్రతా సిబ్బందిని ట్రంప్ అధికార యంత్రాంగం అక్కడకు పంపింది.