Visakhapatnam: బీచ్ రోడ్‌లో హెలికాప్టర్ దిగిందోచ్.. విశాఖలో ఇక నాన్ స్టాప్ సందడే సందడి..!

2 days ago 2

ఆర్కే బీచ్ అనగానే సుందరమైన సాగర్ తీరం… ఆహ్లాదాన్ని పంచే వాతావరణం.. ఇప్పుడు దానికి మరింత వన్నె తెచ్చేలా నావికాదళ మ్యూజియంలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్కే బీచ్ రోడ్డు సబ్ మెరైన్ జలంతర్గామి మ్యూజియం, టీయూ-142 యుద్ధ విమానం మ్యూజియం, సీహారియర్ విమానాలను ప్రదర్శనకు ఉంచారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు విశాఖకు బీచ్ రోడ్ కు మరింత వన్నె తెచ్చేలా మరో మ్యూజియం సిద్ధమవుతోంది. అదే UH3H హెలికాప్టర్ మ్యూజియం.

పదిహేడేళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి..

నేవీలో పదిహేడేళ్ల సుదీర్ఘ సేవలు అందించిన UH3H హెలికాప్టార్.. ఈ ఏడాది జూన్‌ 28వ తేదీన ఐఎన్‌ఎస్‌ డేగాలో డీ కమిషనింగ్‌ జరిగింది. అయితే.. యుహెచ్‌-3హెచ్‌ హెలికాప్టర్‌ను ఇస్తామని.. దానిని కూడా మ్యూజియంగా మలచాలని కలెక్టర్‌ ద్వారా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – వీఎంఆర్‌డీఏ – VMRDA ను నేవి కోరింది. దానికి వారు సానుకూలంగా స్పందించడంతో అందుకు తగిన ఏర్పాట్లు మొదలయ్యాయి. చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్మారక ఫాలకాన్ని అందజేశారు. ఆ తర్వాత.. హెలికాప్టర్ మ్యూజియం నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. ఇందులో భాగంగానే.. హెలికాప్టర్ ను విడిభాగాలుగా చేసి.. ఐఎన్ఎస్ డేగా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి భారీ క్రేన్ సాయంతో బీచ్ రోడ్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు. శరవేగంగా ఈ పనులు సాగిపోతున్నాయి.

హెలికాప్టర్ తో సెల్ఫీలు..సందడే సందడి..

ఎక్కడో దూరం నుంచి, నేవి డే వేడుకల్లో దర్శనం ఇచ్చే ఈ హెలికాప్టర్ కళ్ళ ముందు కనిపిస్తున్నడంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. మ్యూజియంగా మారబోతున్న ఈ హెలికాప్టర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

మూడు వైపులా ముఖద్వారం ఉండేలా..

ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న మిగతా మ్యూజియంలకు టోటల్ డిఫరెంట్ గా ఈ UH3H హెలికాప్టార్ మ్యూజియం ను నిర్మిస్తున్నారు. మూడు వైపులా ముఖద్వారం వచ్చేలా అద్దాలతో చక్కటి డిజైన్‌ రూపొందించారు. దీనికి సుమారుగా 80 లక్షల వ్యయం అంచనా వేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో.. ఈ నిర్మాణం పూర్తయితే బీచ్‌కు అదనపు ఆకర్షణగా మారనుంది..

గస్తీ, రెస్క్యూలో ధీశాలి UH3H

ఈ యుహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌ గస్తీ తీ పాటు సహాయక చర్యల్లో దిశాలిగా అభివర్ణిస్తుంటారు. నేవీలోకి 2007లో ప్రవేశించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వతో అనుసంధానంగా పనిచేసింది. తీర ప్రాంత గస్తీకి, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి, సముద్రంలో తప్పిపోయిన వారిని గాలించడానికి, నేవీకి సంబంధించిన సరకులను తరలించడానికి దీని సేవలను విరివిగా వినియోగించుకున్నారు. దీని సర్వీసు పూర్తి కావడంతో ఈ ఏడాది జూన్ 28న విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో డీ ఇండక్షన్ వేడుక జరిగింది. 17 ఏళ్ల పాటు అద్భుతమైన సేవ చేసిన ఈ హెలికాప్టర్ కు తూర్పు నావికదళం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆ కార్యక్రమానికి తూర్పు నాలుగుకారుల కామాండెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అధ్యక్షత వహించారు. యుహెచ్ 3హెచ్ స్క్వేర్టర్న్లోని అనుభవజ్ఞులైన అధికారులు నావికదళ హెలిక్యాప్టర్ అద్భుతమైన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు. యుహెచ్ 3హెచ్ స్క్వేడ్రన్ లోని ఐ ఎన్ ఏ ఎస్ 350 వద్ద సి కింగ్ 42 సి హెలికాప్టర్ తో నావికాదళానికి భర్తీ చేయనున్నారు. సముద్ర ప్రతికూల వాతావరణం లోను యుహెచ్ 3హెచ్ హెలికాప్టర్ భారత నావికాదంలో చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

2007లో నావికాదళంలో చేరి.. విశేష సేవలందించి..

1960 దశకంలో యుఎస్ లో ఇది తయారైంది. ఆ తరువాత 2007 ఐఎన్ఎస్ జలాస్వ యుద్ధ నౌకతోపాటు భారత తీరానికి తీసుకువచారు. యుహెచ్3హెచ్ హెలికాప్టర్ 2009 మార్చి 24న విశాఖలోని ఐఎన్ఎస్ డేగా వద్ద INAS 350 ‘సారస్ ‘ గా నామకరణం చేశారు. ఈ హెలికాప్టర్ బహుముఖ సేవలను అందించింది. హ్యుమానిటీరియల్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కార్యకలాపాలతో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ భద్రత ప్రత్యేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. అధునాతన శోధన రెస్క్యూ సామర్థ్యాలు లాజిస్టిక్ సపోర్ట్ చేస్తూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో చాలా కీలకపాత్ర పోషించింది. లెక్కలేనన్ని ప్రాణాలు కాపాడింది ఈ హెలికాప్టర్. శక్తివంతమైన సారస్ స్క్వాడ్రన్ కు చెందిన ఈ హెలికాప్టర్ ‘బలం, శౌర్యం, పట్టుదల’ అనే నినాదంతో విరివిగా సేవలందించింది. అప్రమత్తమైన నిఘాను నిర్వహించడమే కాకుండా అంచలంచలుగా అంకితభావంతో మన దేశం సముద్ర సరిహద్దుల భద్రతపైనా తన విశేష సేవలను అందించింది.

ఆ హెలీక్యాప్టరే అది..!

నేవీ విధుల్లో ఉండే ఈ హెలికాప్టర్.. తన విధి నిర్వహణలో భాగంగా ప్రతియటా ఒకసారి సందర్శకులు ముందుకు వచ్చేది. అది విశాఖలో ఏటా డిసెంబరులో నిర్వహించే నేవీ డే కార్యక్రమాల్లో బీచ్ రోడ్ లో జరిగే విన్యాసాలలో పాల్గొనేది ఈ హెలికాప్టర్. కమెండోలు తాళ్ల ద్వారా సముద్రంలో దిగి బాధితులను రక్షించడానికి ఈ యుహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌నే వినియోగించేవారు. ఇప్పుడు అదే హెలికాప్టర్ మ్యూజియంగా మారబోతొంది. నావికాదళంలో తన సేవా జీవితం ముగించిన ఈ యుహెచ్3హెచ్.. విశాఖలోని సిటీ ఆఫ్ డెస్టినీలో.. ప్రత్యేక పర్యాటక ప్రాంతమైన ఆర్కే బీచ్ శాశ్వత ప్రదర్శనగా రాబోతోంది. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తోంది. నావికాదళం శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడంతో పాటు భావితరాలకు స్ఫూర్తినిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article