ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. దీంతో రోజుకో మోడల్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. ఈ జాబితాలోకి ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ వెలోసిఫెరో చేరింది. ఈ కంపెనీ తయారు చేసిన వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 డబ్ల్యూ మన దేశంతో విడుదలైంది. ఈ స్కూటర్ ధర, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. భారతదేశంలోని ఆటో మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నామని ఈ ఏడాది ప్రారంభంలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ వెలోసిఫెరో (వీఎల్ఎఫ్) ప్రకటించింది. దానికి అనుగుణంగానే వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ ఫోరూమ్) గా నిర్ధారించింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో ఉన్న ప్లాంట్ లో ఈ స్కూటర్ ను తయారు చేస్తున్నారు. కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్ తో ఈ సంస్థకు భాగస్వామ్యం ఉంది.
టెన్నిస్ 1500 డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు నుంచి 157 గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. దీనిలో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. 720 వ్యాట్ చార్జర్ ను ఉపయోగించి కేవలం మూడు గంటల్లోనే బ్యాటరీని వంద శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. వీఎల్ఎఫ్ టెన్నిస్ స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సెటప్ పై అధిక స్టీల్ ఫ్రేమ్ ను ఏర్పాటు చేశారు. ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రెండు వైపులా 12 అంగుళాల రిమ్ములకు 110/80 సెక్షన్ టైర్లను వాడారు. ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోలు మాత్రమే. సీటు ఎత్తు 780 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 140 ఎంఎంగా ఉన్నాయి. సీటు కింద కేవలం హాఫ్ ఫేస్ హెల్మెట్ ను ఉంచడానికి మాత్రమే చోటు ఉంటుంది.
టెన్నిస్ స్కూటర్ లో ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టైల్ లైట్, ఐదు అంగుళాల టీఎఫ్ టీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎరుపు, తెలుపు, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. వీఎల్ఎఫ్ టెన్నిస్ స్కూటర్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే మన దేశంలో 1500 డబ్ల్యూ వేరియంట్ మాత్రమే దొరుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లోకి 4000డబ్ల్యూ వేరియంట్ ను తీసుకువెళ్లారు. మన దేశంలో మార్కెట్ ను శాసిస్తున్న ఏథర్ 450 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, వీడా వీ1 ఈవీలకు వీఎల్ఎఫ్ టెన్నిస్ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి