టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని కూటమి నేతలే ఎన్నికల ముందు చెప్పారన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టేశారని జగన్ ఆరోపించారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందన్నారు. ప్రజలు కూటమి నేతల కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదన్నారు వైఎస్ జగన్. యధేచ్ఛగా ఇసుక స్కాం, లిక్కర్ స్కామ్‌లకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను తీవ్రవాదులపై పెట్టే కేసులను వేధించి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తప్పు చేసినవారిని చట్టంముందు నిలబెడతామన్నారు.
జగన్ 2.Oలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా
జగన్ 1.O ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే ఫోకస్ చేశామన్నారు. తమ కంటే ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని జగన్ మండిపడ్డారు. జగన్ 2.Oలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామన్నారు. వాళ్లకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీకాలం ముగియబోతోందని.. తమ వాళ్లని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై మరిన్ని దొంగకేసులు పెడతారన్నారు.
వీడియో చూడండి..
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ రెండే రెండు మున్సిపాలిటీలు గెలిచిందని.. ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ఆ ఫలితాలను గౌరవించామన్నారు జగన్. అయితే టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందన్నారని ఆరోపించారు. గతంలో ముసలమ్మ కూడా బటన్లు నొక్కుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం అని ఆరోపించారు.
ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో అని కామెంట్ చేశారు. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమేనని, అందరూ ధైర్యంగా ఉండాలని వైసీపీ నేతలకు ధైర్యం చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..