తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది నిష్టతో అయ్యప్ప మాల ధరిస్తారు. అంతే సంఖ్యలో శబరిమలలో స్వామివారిని దర్శించుకుని మాల విడుస్తారు. ప్రతి ఏటా అయ్యప్పల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో శబరిమలలో తరచుగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అంతేకాక 12 గంటల నుంచి 18 గంటల వరకు క్యూలైన్లలో నిలుచునే పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు.. ఎక్కడైనా ఏ సమస్యలోనైనా అయ్యప్ప భక్తులు చిక్కుకుంటే వెంటనే సహాయం అందించే విధంగా సాంకేతికత జోడించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టెక్నాలజీతో సేవలు అందిస్తున్నారు. శబరిమల ఉన్న పత్తనతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్ సౌకర్యానికి అంకురార్పణ చేశారు. అసలు శబరిమల భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, క్యూలైన్లు ఎందుకు పెరుగుతున్నాయి, పంబానది వద్ద, ఘాట్ రోడ్డు లో ఎందుకు భక్తులు ఆగిపోతున్నారు ఇలా వివిధ సమస్యలను పరిశీలించి, అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ వాట్సాప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్.
శబరిమలకు వెళ్లే భక్తులు చేయాల్సినదల్లా సింపుల్గా 6238008000 ఈ నెంబర్ ని సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత వాట్స్అప్ లోకి వెళ్లి హాయ్ అని టైప్ చేస్తే వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఈ ఆరు భాషల్లో వాట్సప్ సమాచారం అందుతుంది. మీరు క్యూలైన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్న, ఆలయం సేవలు, ఏదైనా ప్రత్యేక సేవలు గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మీకు వచ్చేస్తుంది. అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీ, మీరు ఎక్కడైనా చిక్కుకున్న, శబరిమల వస్తున్న దారిలో మీ వాహనం చెడిపోయిన మీకు పోలీసులు వచ్చి వెంటనే సహాయం అందిస్తారు. దీంతోపాటు మీతో వచ్చిన భక్తులు ఎవరైనా తప్పిపోయిన వారిని వెతికేందుకు సహాయపడతారు. వాట్సాప్ లో మీ వివరాలు ఇవ్వగానే వెంటనే మీకు కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. అవతల వైపు నుంచి మీరు ఎంపిక చేసుకున్న భాషలో మాట్లాడినా మీ సమస్యని అర్థం చేసుకుంటారు. మీకు వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తారు.
ఇవి కూడా చదవండి
గతంలో ఎటువంటి ఎమర్జెన్సీ సిచువేషన్ ఉన్న డయల్ 100 కానీ, ఆలయం కాంటాక్ట్ నెంబర్ కానీ ఫోన్ చేయాల్సి వచ్చేది. దేశవ్యాప్తంగా వచ్చే లక్షలాది మంది భక్తులతో ఈ నెంబర్లు నిరంతరం బిజీగా ఉంటుండేది. దీంతో పాటు బాష సమస్య కూడా.. వీటన్నిటికీ చెక్ పట్టారు కలెక్టర్ ప్రేమ్ కుమార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహాయంతో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొండపైన రద్దీని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఇప్పుడు భక్తులకు లభించింది. ఎటువంటి సహాయం అయినా సింపుల్ వాట్సాప్ ద్వారా పోలీసులకు అందించే అవకాశం తీసుకువచ్చారు. నిజంగా శబరిమల కి వెళ్లే భక్తులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..