ప్రతి ఏడాది ఆ ఒక్కరోజు ఆ ఊళ్ళో ఎవరు ఇంట్లో ఉండరు. గుడికి, బడికి, ఇళ్లకు తాళాలు వేసి ఊరి పొలిమేరకు వెళ్లిపోతారు. ఆరోజు ఊళ్లో ఉంటే అరిష్టం అని గ్రామస్తుల నమ్మకం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అనే గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. దాని పేరే అగ్గిపాడు ఈ వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. పూర్వం వందల సంవత్సరాల క్రితం తలారి చెరువు గ్రామంలో పండిన పంటలను దొంగలించడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుని గ్రామస్తులు కొట్టి చంపారట. చనిపోయిన బ్రాహ్మణుడి శాపం కారణంగా గ్రామంలో కరువు, కాటకాలు పోలియో తాండవం చేస్తున్నాయట. అదేవిధంగా గ్రామంలో పుట్టిన పసిపిల్లలు పుట్టినట్లుగానే చనిపోతున్నారని గ్రామస్తులంతా ఓ మహర్షి వద్దకు వెళ్లి పరిష్కారం కోరారు అట..
ఆ స్వామీజీ సూచనల మేరకు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున గ్రామంలో దీపం, పొయ్యి వెలిగించకూడదని గ్రామస్తులంతా పిల్లాపాపలతో పాటు పశువులను కూడా తీసుకుని ఊరి పొలిమేర ఉన్న హాజీవలి దర్గాకు వెళ్లాలని ఆ స్వామి గ్రామస్తులకు సూచించారు. దీంతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు గ్రామస్తులంతా ఒక రోజంతా వంటా,వార్పు చేసుకుని… అక్కడే తిని.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేవారు.
ఇంటికి వెళ్లగానే ప్రతి ఒక్కరూ తమ గడపకు కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వెళ్లడం సంవత్సరాలుగా ఆనవాయితీగా వచ్చింది. అప్పటి నుండి తలారి చెరువు గ్రామస్తులు ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. సంవత్సరంలో ఇలా ఒక్కరోజు ఊరి పొలిమేరకు వెళ్లి రోజంతా వంట వార్పు చేసుకుని గడపడంతో తమ గ్రామంలో ఇప్పటికీ కరువు, కాటకాలు. పసిపిల్లలకు అనారోగ్య సమస్యలు రావడంలేదని గ్రామస్తులు నమ్ముతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..