సమతాకుంభ్ 2025 మహోత్సవాల్లో రెండోరోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆచార్యుల స్వహస్తాలతో గరుడ పట ఆరాధన, ధ్వజారోహణం చేయించారు. విశేషోత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరగగా, సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Samatha Kumbh
Updated on: Feb 10, 2025 | 8:29 PM
ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న ముచ్చింతల్‌లోని శ్రీ రామానుజాక్షేత్రంలో.. సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అగ్నిప్రతిష్ట అయ్యాక సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వంజం దగ్గరికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి రుత్విక్‌లతో కలిసి వచ్చి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి దివ్యసాకేతంలోని రాముడు సూర్యప్రభ వాహనంపై వచ్చి కార్యక్రమ పెద్దగా ఉండి, శుభారంభం కావించాడు. 108 దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్లకు అధిపతి అయిన శ్రీరామచంద్రుడు దగ్గరుండి అందరినీ నడిపిస్తారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు.
గరుడ పట ప్రసాదాన్ని సంతానార్ధులకు అనుగ్రహించారు. తర్వాత యాగశాలలో అగ్ని ఆవిర్భావం, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా.. జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. శ్రీరంగం వాసులు విష్ణుచిత్తన్ స్వామివారికి చినజీయర్ స్వామి 32వ గోపాలోపాయన పురస్కారం అందించారు. తొలిరోజు శ్రీరంగం నుంచి తిరుక్కణ్ణపురం వరకు 18 మంది దివ్యదేశాధీశులకు గురుడోత్సవం కనుల విందు చేసింది. విశేష కార్యక్రమాలు ఏ రోజుకు ఆరోజు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ నిర్వహించారు. 18 మంది దివ్యాదేశాధీశులకు 18 గరుడల సేవలతో ముచ్చింతల్ ఇలా వైకుంఠపురిని తలపించింది. రండి, దర్శించి తరిద్దాం.. సమతాకుంభ్ వేడుకల్లో పాల్గొందాం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి