పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ బృందం.. అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ టీమ్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సులో ఏకంగా లక్షా 32 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు సాధించింది. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతి పెద్ద రికార్డు. ఈ సదస్సులో పదికిపైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ సర్కార్.
దావోస్ పర్యటనలో అమెజాన్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్‌లో ఏకంగా 60,000వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోఅదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది. టిల్మాన్ గ్లోబల్ హెల్డింగ్స్‌తో రూ.15 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంవోయూ కుదుర్చుకుంది.
సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల ఎస్, జేఎస్‌డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్లు, కంట్రోల్ ఎస్ కంపెనీ 10వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. వీటితో పాటు హెచ్‌సీఎల్, యూనీలివర్, విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్ లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 47,550 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..