పూణె, జనవరి 27: మరో ప్రాణాంతక మహమ్మారి మారణహోమం సృష్టిస్తుంది. మహారాష్ట్రలో వెలుగు చూసినగులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పూణెలో తొలి మరణం కూడా సంభవించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న గులియన్-బారే సిండ్రోమ్ (GBS) బ్యాక్టీరియా కారణంగా తొలి మరణం సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. జీబీఎస్ వ్యాధి లక్షణాలతో జనవరి 9న ఆసుపత్రిలో చేరిన ఓ రోగి పూణే క్లస్టర్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జీబీఎస్ మహమ్మారి కేసుల సంఖ్య 101 కి పెరిగింది. వీరిలో 28 మందికి ఇన్ఫెక్షన్ ధృవీకరించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో 16 మంది ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో దాదాపు 19 మంది రోగుల వయసు తొమ్మిదేళ్ల కంటే తక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తుంది.50 నుంచి 80 ఏళ్ల వయస్సు వారు 23 మంది వరకు ఉన్నారు.
ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. అందులో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది . GBS వ్యాధి ప్రపంచంలో మూడవ వంతు మరణాలకు కారణమవుతుంది. ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధులలో ఒకటి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేసులు అధికంగా నమోదవుతున్న పూణేలోని పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరిస్తున్నారు. పూణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ.కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు శనివారం విడుదలైన ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఆ బావిని అసలు వినియోగిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియ రాలేదని అధికారులు చెబుతున్నారు.
దీంతో పూణెలోని ప్రజలను నీటిని బాగా మరిగించి తాగాలని, తినే ఆహారాలను కూడా వేడిపై ఉడికించి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేసులను ట్రేస్ చేసేందుకు అధికారులు ఆదివారం నాటికి మొత్తం 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక GBS చికిత్స చాలా ఖరీదైనది. ఒక్కో ఇంజెక్షన్‌కు ఖరీదు సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది. ఈ బ్యాక్టీరియా శరీర రోగనిరోధక వ్యవస్థను గుళ్ల చేసి ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. మెదడు సంకేతాలను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్లే నరాలపై దాడి చేసి, బలహీన పరుస్తుంది. దీంతో పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే శరీర భాగాలు చలనం లేకుండా పడిపోతాయన్నమాట. బాధిత రోగులలో 80 శాతం మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 6 నెలలలోపు కోలుకుని నడవగల సామర్థ్యాన్ని తిరిగి పొందుతారని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరికి మాత్రం పూర్తిగా కోలుకోవడానికి ఏడాది, అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
ఈ వ్యాధి సోకిన రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) ఇంజెక్షన్ల కోర్సు అవసరమవుతుంది. పూణెలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో జనవరి 10 నాటికి 26 మంది GBS రోగులు ఉండగా గత శుక్రవారం (జనవరి 24) నాటికి వారి సంఖ్య 73కి పెరిగింది. పూణేలో పెరుగుతున్న జీబీఎస్ వ్యాధికి చికిత్స ఖరీదైనది. జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించిన అనంతరం ఈ వ్యాధి బారీన పడిన రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.