అలెగ్జాండ్రిన్ చిలకలు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండరు కానీ.. ఖచ్చితంగా చూసే ఉంటారు. అసలే పోనుపోను చెట్లతో పాటు కొన్ని పక్షులు, జంతువుల జాతులు కూడా అంతరించిపోతున్నాయి. అయితే.. ఉన్నవాటిని అయినా కాపాడుకునే అవసరం ఇప్పుడు మనకు ఎంతైనా ఉంది. అయితే అలెగ్జాండ్రిన్ చిలకలను ఓ వ్యక్తి అమ్ముతూ దొరికిపోయాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ చిలుకల సంఖ్య చాలావరకు తగ్గిపోవడంతో అరుదుగా కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో తప్ప ఆసలు కనపడడం లేదు. ఈ క్రమంలోనే పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్మడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫారూఖ్ ని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అటవీ అధికారులు జూపార్కుకు తరలించారు. అలెగ్జాండ్రిన్ చిలుకలను అక్రమంగా అమ్ముతున్న మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వన్యప్రాణి చట్టం ప్రకారం చిలుకలను వేటాడటం నేరం అని హెచ్చరించారు.