సముద్రంలోకి వెళ్లినప్పుడు తిమింగలాన్ని చూడడం. అడవిలో కొండచిలువను కలవడం చాలా భయంకరమైన అనుభవాలుగా చెప్పొచ్చు. ఇలాంటివి చాలా అరుదుగా జరిగినా.. అసాధ్యం కాదు. భారీ కొండచిలువలు, మొసళ్ళు, తిమింగలాలు వంటి జీవులతో మనుషులు ఎదుర్కోవడం అనేది చాలా ప్రమాదకరం. కొన్ని జంతువులకు మనుషులను పూర్తిగా మింగేసే సామర్థ్యం ఉంది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొండచిలువ
కొండచిలువ 20 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పాము. దీని దవడలు చాలా సాగేవి, శక్తివంతమైనవి. దీని కారణంగా తల కంటే చాలా పెద్ద ఆహారాన్ని కూడా ఇది మింగగలదు.
2018లో ఇండోనేషియాలో వాటిబా అనే 54 ఏళ్ల మహిళను 23 అడుగుల కొండచిలువ మింగేసింది. గ్రామస్తులు పామును చంపి ఆమె శరీరాన్ని దాని కడుపులో కనుగొన్నారు. 2017లో అక్బర్ అనే మరో ఇండోనేషియా వ్యక్తిని పామ్ ఆయిల్ తోటలో పనిచేస్తుండగా కొండచిలువ చంపి మింగేసింది.
గ్రీన్ అనకొండ
దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ బరువులో చాలా పెద్దది. కొన్నిసార్లు 500 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది తన ఆహారాన్ని చుట్టి చంపి ఆపై పూర్తిగా మింగేస్తుంది.
అనకొండ మనుషులను మింగినట్లుగా నిర్ధారించబడిన కేసులు లేవు. కానీ అవి జింక వంటి పెద్ద జంతువులను తినగలవు కాబట్టి మనుషులను కూడా మింగేసే అవకాశం ఉంది. అమెజాన్ లోని స్థానికులు దగ్గరి నుండి చూసినట్లు చెప్పినా దానికి సరైన ఆధారాలు లేవు.
ఉప్పునీటి మొసలి
ఉప్పునీటి మొసళ్ళు 23 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి పెద్ద ఆహారాన్ని పూర్తిగా మింగేయగలవు. వాటి దవడలు ఎముకలను కూడా చూర్ణం చేయగలవు. వాటి జీర్ణవ్యవస్థ చాలా బలమైనది.
2016లో ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఈత కొడుతుండగా 24 ఏళ్ల మహిళను ఉప్పు నీటి మొసలి చంపి తినేసింది. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా నుండి ఇలాంటి అనేక కథనాలు ఉన్నాయి. వీటిలో మొసళ్ళు చేపలు పట్టేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు మనుషులను తిన్నట్లు పేర్కొన్నారు.
హంప్‌బ్యాక్ వేల్ (తిమింగలం)
హంప్‌బ్యాక్ వేల్ (తిమింగలం) తన భారీ నోటిని ఉపయోగించి క్రిల్, చిన్న చేపలను ఫిల్టర్ చేస్తుంది. వీటి గొంతు మనుషులను మింగడానికి చాలా చిన్నది. కానీ వాటి పరిమాణం కారణంగా ప్రజలు ప్రమాదవశాత్తు వాటి నోటిలో చిక్కుకుపోవచ్చు.
2021లో మసాచుసెట్స్ తీరంలో లాబ్‌స్టర్ డైవర్ మైఖేల్ ప్యాకర్డ్ హంప్‌బ్యాక్ వేల్ నోటిలో కొద్దిసేపు చిక్కుకున్నాడు. 30-40 సెకన్ల తర్వాత అతన్ని బయటకు ఉమ్మివేసింది. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది.