భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో కాపాడిన వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. మరి అతను అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Rishabh Pant
Updated on: Feb 12, 2025 | 6:29 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 2022 డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి ఒంటరిగా కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో పంత్ కరు పూర్తిగా కాలి బూడిదయ్యింది. కానీ, అదృష్టవశాత్తు పంత్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో కారులోంచి ఎలాగోలా బయటికొచ్చి.. కొన ఊపిరితో ఉన్న పంత్‌ను రజత్ అనే కుర్రాడు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రజత్ అప్పటికప్పుడు అలా సేవాభావంతో స్పందించడం వల్లే పంత్ ఈ రోజు ఇలా ఉన్నాడు. లేదంటే.. తీవ్ర గాయాలతో ఉన్న అతను మరింత ఇబ్బందిపడేవాడు. వైద్యులు కూడా పంత్‌ను గోల్డెన్ అవర్‌లోనే ఆస్పత్రికి వచ్చాడంటూ పేర్కొన్నాడు. అంటే మరింత ఆలస్యమై ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని అర్థం.
సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చిన రజత్‌ను వైద్యులు కూడా అభినందించారు. ఆ తర్వాత పంత్ కూడా రజత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే.. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రజత్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అది కూడా తన ప్రేయసితో కలిసి అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో గల బుచ్చా బస్తీలో నివాసం ఉండే రజత్.. ప్రేమ పెళ్లికి తన తల్లిదండ్రులతో పాటు తన ప్రేయసి ఇంట్లో కూడా ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం బుచ్చా బస్తీలో తన లవర్‌తో కలిసి రజత్ పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రజత్ పరిస్థితి విషమంగా ఉండగా, అతని ప్రేయసి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో రజత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..