ప్రయాగ్‌రాజ్, జనవరి 19: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ‘మహా కుంభమేళా’ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంది. ఈ మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి రకరకాల బాబాలు, సాధువులు తరలివస్తున్నారు. ఈ మతపరమైన కార్యక్రమానికి హాజరైన యాత్రికులను ఆకట్టుకుంటుంది మాత్రం అక్కడి వింత విలక్షణతను చాటుతున్న రకరకాల సాధువులు. ఒకరు తలపై బార్లీ పంట సాగుచేస్తుంటే.. మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు. 45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు కాస్తపెద్దగానే ఉంటుంది. అయితే తాజాగా ‘కాంటే వాలే’ బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసలు ఆ బాబాకు ‘కాంటే వాలే’ బాబా అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఆయనెవరో ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..
నిజానికి.. ‘కాంటే వాలే’ అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ. ఆయన స్పెషాలిటీ పదునైన ముళ్ల పాన్పుపై అలవోకగా పడుకోవడం. అవును.. అతడు పూల పాన్పు మాదిరి.. అతడు పదునైన ముళ్లపాన్పుపై పడుకుంటాడు. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అతడి ముళ్ల మీదనే పవలిస్తున్నాడు మరి. తన ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురంచి కాంటే వాలా బాబా మాట్లాడుతూ.. ‘నాకు ముళ్ల పాన్పుపై పడుకునే శక్తిని, జ్ఞానాన్ని అందించిన ఆ ఆది గురువుకు నేను ఎల్లవేళలా కృతజ్ఞుడను. ఎటువంటి బాధ లేకుండా దీన్ని చేయడానికి భగవంతుడి మహిమే. నిజానికి ఇలా ముళ్లపై పడుకోవడం నా శరీరానికి ఎలాంటి హానీ కలిగించదు. బదులుగా మేలు చేస్తుందని’ బాబా అంటున్నారు.
ఇక ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో ముళ్లపాన్పుపై పడుకున్న ఈ బాబాని చూడటానికి ఎంతో మంది భక్తులు క్యూ కడుతున్నారు. వారు అక్కడికి వచ్చి ఆయనను చూసి దక్షిణ కూడా సమర్పిస్తున్నారు. బాబా తన దక్షిణలో సగభాగాన్ని దైవ చింతనకు, మిగిలిన సగాన్ని తన జీవనోపాధి కోసం ఉపయోగిస్తానని చెబుతున్నారు. ముళ్ల మంచంపై ఉన్న బాబాను చూసి చాలా మంది యాత్రికులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబడుతోన్న మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీఓ ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.